
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 22 రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.
నియంత్రణ రేఖ (LoC) సమీపంలో రావల్కోట్లోని జరిగిన ఆందోళనా కార్యక్రమంలో భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ (JAAC) నేతలు ప్రసంగిస్తూ.. ‘పీవోకే అసలు పాక్లో భాగం కాదు’ అని స్పష్టం చేశారు. తమకు పాకిస్థాన్ అవసరమే లేదని, వారికే తమ (PoK) అవసరం ఉందన్నారు.
ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ‘ఇతర మార్గాలను’ (భారత్తో సన్నిహిత సంబంధాలు) వెతుక్కోవాల్సి ఉంటుందని జాక్ నేతలు హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరునూ ఎండగట్టారు. నియంతలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. జాక్ నేతల ప్రసంగాలకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారాయి.
వెనెజువెలాలో భారత నావికుడు మృతి.. అవయవాలు మాయం..!
పీవోకేలో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే వాదన ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్న (PoK Protests) స్థానికులను తన దారిలోకి తెచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరకులతో వస్తున్న ట్రక్కులు పీవోకేలోకి రానీయకుండా ఇటీవల అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే అనేక ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమపిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది. ఆందోళనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు కొన్ని రోజులుగా అక్కడ ఇంటర్నెట్ సేవలపైనా పాక్ ఆంక్షలు విధించింది. ఆకలితో అలమటిస్తున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఆంక్షలు సడలించకపోవడంతో పీవోకే ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.