
Samantha | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత ప్రస్తుతం తన జీవితంలోని ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా తర్వాత సినిమాలకు కాస్త విరామం తీసుకున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా సమంతకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. భారతీయ సంప్రదాయాలపై తనకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉందని చెప్పే సమంత.. అదే భావనతో ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించినట్లు వెల్లడించారు. భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. సాధారణంగా సీమంతం అంటే కాబోయే తల్లిని ఆశీర్వదించే వేడుకగా భావిస్తారు. అయితే తనకు ఈ కార్యక్రమం కేవలం ఒక ఆచారంగా అనిపించలేదని, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను తెలుసుకున్న కొద్దీ మరింత ప్రత్యేకంగా అనిపించిందని సమంత తన పోస్ట్‌లో వివరించారు. తనకు భారతీయ సంప్రదాయాలన్నా ఎంతో గౌరవమని సమంత పేర్కొన్నారు. ప్రతి ఆచారం వెనుక ఉన్న పూర్తి అర్థం తనకు తెలియకపోయినా.. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని తాను నమ్ముతానని చెప్పారు. శ్రీవిద్య ఉపాసకుడైన పూజారి వేడుకలోని ఒక్కో దశను వివరిస్తున్న సమయంలో.. సీమంతం ఎంత ఆలోచనాత్మకంగా, అర్థవంతంగా రూపొందించబడిందో తనకు అర్థమైందని సమంత తెలిపారు. ప్రతి మంత్రానికి ఒక ఉద్దేశం, ప్రతి సమర్పణకు ఒక అర్థం, ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని వివరించారు. ఈ వేడుకలో తనను చూసే విధానం తనను ఎంతో కదిలించిందని సమంత చెప్పారు. కాబోయే తల్లిని కేవలం బిడ్డకు జన్మనివ్వబోయే మహిళగా కాకుండా.. ఒక కొత్త జీవితానికి రూపం ఇచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించడం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.శ్రీవిద్య సంప్రదాయంలో నిర్వహించే ప్రత్యేక ఆచారాల ద్వారా కాబోయే తల్లి శరీరంలోని ఏడు చక్రాలను గౌరవించే విధానం ఉంటుందని ఆమె వివరించారు. పవిత్ర జలం, మంత్రోచ్ఛారణల ద్వారా శక్తి కేంద్రాలను శుద్ధి చేసి, తల్లి-బిడ్డకు రక్షణ, ఆశీర్వాదాలను ఆహ్వానించే భావన ఇందులో ఉంటుందని తెలిపారు. అభిషేకం అనంతరం కాబోయే తల్లిని పవిత్రమైన శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారని సమంత వివరించారు. శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలు ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలకు ప్రతీకలుగా భావిస్తారని చెప్పారు. దేవీ ఖడ్గమాల పారాయణ సమయంలో వివిధ దివ్యశక్తులు, దేవతల పేర్లను జపిస్తూ బయటి ఆవరణల నుంచి కేంద్రం వైపు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తారని పేర్కొన్నారు. ఈ మంత్రోచ్ఛారణ తల్లీబిడ్డ చుట్టూ రక్షణ, ఆశీర్వాదాల భావనను కలిగిస్తుందని వివరించారు.ఈ మొత్తం ప్రక్రియను దగ్గరగా అనుభవిస్తూ, తనకు మరియు తన బిడ్డకు ఏం ఆహ్వానించబడుతుందో అర్థం చేసుకోవడం ఎంతో శక్తివంతమైన అనుభూతిని ఇచ్చిందని సమంత తెలిపారు.ఈ వేడుక గురించి దాదాపుగా ఎలాంటి అవగాహన లేకుండానే తాను అక్కడికి వెళ్లానని సమంత చెప్పారు. కానీ కార్యక్రమం పూర్తయ్యే సమయానికి ఎంతో ఆశీర్వాదం, రక్షణ పొందిన అనుభూతి కలిగిందని వెల్లడించారు.ఈ అందమైన వేడుకను తనకు అందించిన శిల్పారెడ్డికి సమంత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, భారతీయ సంప్రదాయాల్లో దాగి ఉన్న జ్ఞానానికి ధన్యవాదాలు చెప్పారు. A post shared by Samantha (@samantharuthprabhuoffl)



