
హైదరాబాద్‌: తరతరాల అణచివేత, దోపిడీ, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘‘నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు తెలంగాణ పుట్టినిల్లు. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల చైతన్యాన్ని రగిల్చింది. సమ్మక్క-సారలమ్మ పోరాటం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేక స్థానముంది. నిజాం పాలనలో హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణచివేతలు.. చివరి దశలో రజాకార్ల దౌర్జన్యాలు ప్రజలను కల్లోల పరిచాయి. భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడింది. రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడారు. హైదరాబాద్‌ ప్రజల ఆకాంక్ష మేరకు నెహ్రూ, పటేల్‌ నాయకత్వంలో సైనిక చర్య చేపట్టారు. ఆపరేషన్‌ పోలో అనంతరం ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భమది. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజాపాలన కొసాగిస్తున్నాం. తెలంగాణ పొరుగు రాష్ట్రాలతోనే కాదు.. ప్రపంచంతో పోటీ పడుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలు. దేశ తలసరి ఆదాయం కంటే ఇది 91 శాతం అధికం. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం.’’ అని రేవంత్‌ వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




