
‘వెలుగు మార్ట్‌’తో లాభాలు మహిళా మార్ట్‌లో సరకులు న్యూస్‌టుడే, రంపచోడవరం: స్వయం సహాయక సంఘాల్లో మహిళా సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి సంఘానికి బ్యాంకు రుణాలతోపాటు సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకొనేందుకు ‘స్త్రీనిధి’ ద్వారా వ్యక్తిగత రుణాలను మంజూరు చేసి ప్రోత్సహిస్తోంది. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌) ద్వారా 2023 ఆగస్టులో రూ.24 లక్షలతో వివిధ సంఘాలకు చెందిన 15 మంది సభ్యులు రంపచోడవరంలో ‘వెలుగు మహిళా మార్ట్‌’ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్‌లో కిరాణా, నిత్యావసర సరకులు, ప్లాస్టిక్‌ వస్తువులు, తదితర వస్తువులు విక్రయిస్తున్నారు. జిల్లాలో డీఆర్‌డీఏ (వెలుగు) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు సంబంధించి ఒక్కో సంఘం నుంచి రూ.300 చొప్పున వసూలు చేయగా సమకూరిన రూ.24 లక్షలతో రంపచోడవరంలో ‘మహిళా మార్ట్‌’ను ప్రారంభించారు. గత మూడేళ్ల నుంచి ఇప్పటివరకు రూ.2.29 కోట్ల వ్యాపారం చేశారు. వచ్చిన లాభాలను సభ్యులకు పంచగా, అసలు సొమ్ముతో మళ్లీ సరకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం.. - గంగాభవాని, అధ్యక్షురాలు, వెలుగు మహిళా మార్ట్‌ జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. 15 మంది సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పాటై ‘వెలుగు మహిళా మార్ట్‌’గా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రూ.24 లక్షలతో మహిళా మార్ట్‌గా ఏర్పాటు చేసి కిరాణా, నిత్యావసర సరకుల వ్యాపారాన్ని ప్రారంభించాం. పెట్టుబడి సొమ్ముతో సరకుల కొనుగోలు చేసి విక్రయిస్తూ, వచ్చిన లాభాలతో జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక స్వావలంబనకే.. - డా.రత్నాకరరావు, పీˆడీ, డీఆర్‌డీఏ, రంపచోడవరం స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్త్రీనిధి ద్వారా రుణాలు అందించి వివిధ వ్యాపారాలు పెట్టుకొనేందుకు వెలుగు విభాగం ద్వారా ప్రోత్సహిస్తున్నాం. మూడేళ్ల క్రితం రంపచోడవరంలో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేయగా లాభాలతో ముందుకు సాగుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





