
సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌.. దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరింపజేసిన పవిత్ర గ్రంథం ఖురాన్‌. ఇది నేడు మనందరికీ మార్గదర్శకం. ఖురాన్‌లోని ప్రతి ఆయత్‌కు ప్రాధాన్యం ఉంది. వాటిలో అత్యంత శక్తిమంతమైన ‘ఆయతుల్‌ కుర్సీ’ ఇస్లామిక్‌ ఏకేశ్వరోపాసన సారాంశాన్ని అందిస్తుంది. అల్లాహ్‌ పరిపూర్ణతను నొక్కిచెబుతుంది. సృషికర్త సార్వభౌమాధికారం, నియంత్రణల గురించి వివరిస్తుంది. దైవ ప్రవక్త తన సహచరుడు అబూ హురైరా(ర)కు రంజాన్‌ మాసంలో జకాత్‌ ద్వారా సేకరించిన ఆహార నిధికి కాపలా కాసే బాధ్యతను అప్పగించారు. రాత్రి వేళ ఒక వ్యక్తి ఆహారాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. అబూ హురైరా అతడిని పట్టుకుని, ప్రవక్త వద్దకు తీసుకువెళ్తానని బెదిరించగా.. తనను వదిలేయమని, అందుకు ప్రతిగా ఎంతో ఉపయుక్తమున్న విషయాలు చెబుతానని అన్నాడు. నిద్రపోయే ముందు ఆయతుల్‌ కుర్సీని పఠిస్తే.. అల్లాహ్‌ అతడికి ఒక రక్షకుడిని నియమిస్తాడని, ఇక ఉదయం వరకూ సైతాన్‌ సమీపించలేడని చెప్పాడు. సంతోషించిన హురైరా అతడ్ని వదిలేశాడు. మర్నాడు దైవ ప్రవక్త- ‘నిన్న రాత్రి నీ ఖైదీ ఏం చేశాడు?’ అనడిగారు. జరిగినదంతా ఆయనకు చెప్పగా.. ‘నిజమే చెప్పాడు. కానీ అతడే అబద్ధాలకోరైన సైతాన్‌’ అని వివరించారు. సుప్రసిద్ధ హదీసుల ప్రకారం.. క్రమం తప్పకుండా ఆయతుల్‌ కుర్సీ పఠనంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఉదయం దీన్ని పఠించేవారు రాత్రి వరకూ అల్లాహ్‌ రక్షణలో ఉంటారు. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీనిని ఒకసారి పఠిస్తే.. అల్లాహ్‌ ఒక దేవదూతల సమూహాన్ని వారిని రక్షించడానికి పంపుతాడు. రెండుసార్లు పఠిస్తే.. రెండు దేవదూతల సమూహాలు నియమితమవుతాయి. మూడుసార్లు పఠిస్తే.. ఆ వ్యక్తిని తానే చూసుకుంటానని అల్లాహ్‌ దేవదూతలకు చెప్పాడు. సైౖతాన్, దుష్టశక్తుల నుంచి ఆధ్యాత్మిక రక్షణ కవచంగా దీన్ని పఠించమని దైవ ప్రవక్త సిఫార్సు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





