
మన్యంలో బస్సు వెళ్లని గ్రామాలెన్నో! రాకపోకలకు గిరిజనుల అవస్థలు న్యూస్‌టుడే మారేడుమిల్లి: జిల్లాలో పలు మండలాల్లోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్‌ సౌకర్యం లేదు. రహదారులు బాగా లేకపోవడం, వాగులు దాటాల్సి రావడం, మారుమూల ప్రాంతాలు కావడంతో బస్సులు వెళ్లడం లేదు. కొన్ని ప్రాంతాల గిరిజనులు ఆటోలు, జీపులు, వ్యాన్‌లను ఆశ్రయించి ప్రధాన రహదారికి చేరుకుంటున్నారు. కొండ ప్రాంతాల గిరిజనులకు మాత్రం నడక తప్పడం లేదు. ప్రైవేటు వాహనాల సామర్థ్యం లేకపోవడం, పలువురు చోదకులు నిర్లక్ష్యంగా నడపడం, మద్యం మత్తు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నెండు గ్రామాలకే బస్సు.. వై.రామవరం: ప్రైవేటు జీపులో ప్రయాణం చేస్తున్న గిరిజనం వై.రామవరం: మండలంలో సుమారు 20 వేల జనాభా, 12 పంచాయతీల్లో 78 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు, జీపులు, కొందరు కాలినడకన ప్రయాణాలు సాగిస్తున్నారు. వై.రామవరం, పి.ఎర్రగొండ, పనసలపాలెం, చవిటిదిబ్బలు, దేవరమడుగుల, దాలిపాడు, ఊళెంపాడు, రేగడిపాలెం, కోట, బుల్లోజుపాలెం, ఎర్రంరెడ్డిపాలెం, కె.ఎర్రగొండ గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగిలిన గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనం నేటికీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మారేడుమిల్లి నుంచి ఒక్కటే బస్సు.. మారేడుమిల్లి నుంచి పాతకోట సర్వీసు మారేడుమిల్లి నుంచి గుర్తేడు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఉన్న గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ సదుపాయం ఉంది. మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో 71 గ్రామాలు ఉన్నాయి. వాటిలో కేవలం 13 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. అది కూడా మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోట వెళ్లే బస్సు మాత్రమే. మిగిలిన గ్రామాల ప్రజలంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో సుమారు 60 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేవు. గతంలో కొన్ని గ్రామాలకు ‘సంత స్పెషల్‌’ పేరుతో శనివారం ప్రత్యేకంగా బస్సులను నడిపేవారు. ప్రస్తుతం వాటిని కూడా తిప్పకపోవడంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. రామన్నపాలెం గిరిజనులు ఆటోలపై ప్రయాణం.. దేవీపట్నం: మండలంలో దండంగి వాగు ఆవతల వైపు ఉన్న వి.రామన్నపాలెం, చొప్పకొండ, పాముగండి, డి.ఎన్‌.పాలెం పంచాయతీల పరిధిలో దాదాపు 20 గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు ఆటోలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. బాగా మారుమూల గ్రామాల గిరిజనులు కాలినడకన ప్రధాన రహదారికి చేరుకుని ఆటోలను ఆశ్రయిస్తుంటారు. వీరంతా మండల కేంద్రమైన ఇందుకూరు రావాలంటే దామనపల్లి నుంచి రంపచోడవరం మీదుగా గోకవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆటోలపై ఇందుకూరు చేరుకుంటారు. రానుపోను 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గోకవరం ఆర్టీసీ డిపో నుంచి దేవారం వరకు ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసు ఉండటంతో కొంత ఇబ్బంది లేకున్నా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో 44 గ్రామాలకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్‌ వరకు పునరావాస కల్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




