
తితిదే సహకారంతో 300 గదుల నిర్మాణానికి ప్రణాళిక న్యూస్‌టుడే, అన్నవరం: అన్నవరంలో భక్తులకు వసతి సౌకర్యం మెరుగుపర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్యగిరిపై తితిదే సహకారంతో 300 గదుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ఇక్కడి విష్ణుసదన్‌ (38 మండపాలు), రెండు ఉచిత కల్యాణ మండపాల్లో (ఒక్కో దాంట్లో 12 వివాహాలకు అనుకూలం), పలు ప్రదేశాల్లో అధిక వివాహాలు జరుగుతుంటాయి. వీరి వసతికి హరిహర, శివసదన్‌ సముదాయాల్లో 270 గదులు ఉన్నా ఎటూ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో మరొకటి నిర్మిస్తే ఇబ్బందులు తొలగుతాయి. విష్ణుసదన్‌ దక్షిణ భాగంలో సుమారు 1.60 ఎకరాల స్థలంలో దీని నిర్మాణానికి ప్రణాళిక వేస్తున్నారు. తూర్పు, ఉత్తర భాగాల్లో రోడ్లు ఉండటం, దక్షిణంలో విష్ణుసదన్‌ ఉండటంతో అందరికీ సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రధానాలయాలతో పోలిస్తే(తిరుమల మినహా) అన్నవరంలో వసతికి డిమాండ్‌ ఎక్కువ. వివాహాలు సైతం ఎక్కువగా జరుగుతాయి. దూరప్రాంతాల నుంచి భక్తులు స్వామి సన్నిధికి చేరుకుని బసచేసి వ్రతమాచరించి దర్శనం చేసుకుంటారు. రత్న, సత్యగిరులపై సుమారు 450 గదులు ఉండగా రద్దీ రోజులు, పర్వదినాలు, వివాహాల సమయంలో చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రత్నగిరిపై తితిదే సత్రం శిథిలావస్థకు చేరడంతో తొలగించి నిత్యాన్నదాన భవనం నిర్మిస్తున్నారు. పడమటి రాజగోపురం ఎదురుగా 30 వీఐపీ, ఆలయ ప్రాంగణంలోని పీజీహెచ్‌ సత్రాలనూ తొలగించారు. సీతారామసత్రం దక్షిణ భాగంలోని 48 గదులను తొలగించి ఇక్కడ 140 గదుల నిర్మాణం జరుగుతుంది. దీంతో గదుల కొరత ఏర్పడింది. కమిషనర్‌ ద్వారా సిఫార్స్‌ - చక్రధరరావు, ఈవో సత్యగిరిపై తితిదే సహకారంతో 300 గదుల నిర్మాణానికి దేవాదాయశాఖ కమిషనర్‌ ద్వారా తితిదేకు సిఫార్స్‌ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఈ విషయమై ధర్మకర్తల మండలిలో చర్చించి కమిషనర్‌కు లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




