
హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌): ప్రభుత్వ సంక్షేమ పథకాలను హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ఆధారంగా అమలు చేస్తున్నారు. ఇందులో తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో అనేక మంది పేదలు అర్హత ఉన్నా.. సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు ఇచ్చి సంవత్సరాలు గడిచినా వారికి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. భవిష్యత్తులో కుటుంబమే యూనిట్‌గా అన్ని పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అనేక మందికి న్యాయం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో వాలంటీర్ల ద్వారా ఇష్టానుసారం హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ చేశారు. నాలుగు చక్రాల వాహనం లేకపోయినా మ్యాపింగ్‌లో చూపించడం, కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులను చేర్చడం వంటివి అనేకం జరిగాయి. రేషన్‌కార్డులో పేర్లు తొలగింపు, కొత్తగా పిల్లల పేర్లు చేర్చడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటూ చిరుద్యోగాలు చేసుకునే వారు తమ తల్లిదండ్రుల కార్డుల్లో నుంచి పేర్లు తొలగించాలని కోరినా సాంకేతిక కారణాలు చూపించి పట్టించుకోలేదు. ఫలితంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరంగా ఉండిపోయారు. ఒక్కో గ్రామ, వార్డు పరిధిలో 10 నుంచి 30 మంది వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పింఛన్లు, తల్లికి వందనం, ఇతర పథకాలు వారికి చేరడం లేదు. జిల్లాలో 20 వేల మంది వరకు ఇలాంటి వారు ఉన్నట్లు అంచనా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




