
కార్మిక సంక్షేమ బోర్డు నిధుల కోసం.. మంత్రివర్గంతో చర్చించి అమలుకు యోచన ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా రిజిస్టరయ్యే రవాణా వాహనాలపై రవాణాశాఖ సెస్‌ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆటో సంఘాల నాయకులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామితో చర్చలు జరిపిన సందర్భంగా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయగా వారు హామీ ఇచ్చారు. అయితే బోర్డు ద్వారా కార్మికులకు పథకాలు అమలు చేయాలంటే నిరంతర ఆదాయ వనరులు కావాలి. అందు కోసమే రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లపై సెస్‌ విధించేందుకు యోచిస్తున్నారు. తదుపరి జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రానున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే.. ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, బస్సులు వంటి రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేకంగా సెస్‌ విధిస్తారు. ఆ మొత్తాన్ని సంక్షేమ బోర్డు నిర్వహణకు వినియోగిస్తారు. ఆయా వాహనాల్ని నడిపే డ్రైవర్లతోపాటు క్లీనర్లు, కండక్టర్లు, లోడింగ్, అన్‌లోడింగ్‌ కార్మికులతో పాటు గ్యారేజీలు, వాహన మరమ్మతు రంగంలో పనిచేసే అనుబంధ కార్మికులను కూడా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. బోర్డు ఏర్పాటుతో వారికి ప్రమాద, జీవితబీమాల వంటి సామాజిక భద్రత పథకాలకు, పిల్లల విద్య వంటి అవసరాలకు ఆర్థికసహాయం అందించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచే అన్ని రకాల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌ అమల్లో తెచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చడం లక్ష్యంగా దీన్ని తెచ్చారు. కర్ణాటకలో కొత్తగా రిజిస్ట్రేషన్‌ అవుతున్న రవాణా వాహనాలపై 3% సెస్‌ విధిస్తున్నారు. ఈ నిధులను కార్మికుల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలకు వినియోగించేలా చట్టబద్ధం చేశారు. ఈ నిధుల్లో మోటారు వాహనాలపై విధించే పన్నుల మొత్తాలను కూడా జమ చేసేలా చట్టంలో పేర్కొన్నారు. కేరళంలో కూడా మోటారు వెహికిల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కింద ఈ విధానం అమల్లో ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



