
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 13 : ఓ వైపు వానాకాలంలో సైతం వర్షాలు లేక వేసిన పంటల పండుతాయా… ఎండుతాయో అన్న సందిగ్ధంలో రైతులు ఉంటే, మరో వైపు వ్యవసాయ రంగంలో ఇచ్చే పది గంటల కరెంట్‌ను సైతం సక్రమంగా అందించకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోతలతో వచ్చిపోయే కరెంట్‌తో తమ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నయని, రైతులకు మళ్లీ తిరిగి పాత రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పెట్టిన ఏ సర్కార్ బాగుపడలేదని, ఇప్పటికైనా సంబదిత ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అనిల్ సంఘటన స్థలం చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఏఈ వినీత్ రెడ్డి కి రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.





