
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ లైబ్రరీ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, గ్రంథాలయానికి అప్పగిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ లైబ్రరీని బుధవారం ఆయన పరిశీలించారు. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం, సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భవన పరిస్థితిపై లైబ్రేరియన్ ఆశాజ్యోతి, భాస్కర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. పట్టణ నడిబొడ్డున 16 సెంట్ల స్థలం కేటాయించారని, అది కబ్జా గురైందని వారు పేర్కొన్నారు. స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని గ్రంథాలయానికి అప్పగిస్తామని, భవన నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆదోని పట్టణంలోని పాత ఆకాశ వంతెన కింది భాగంలో ఉన్న అన్న క్యాంటీన్‌లో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భోజనం చేశారు. భోజన నిర్వహణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఎమ్మెల్యే స్వయంగా క్యాంటీన్‌కి వెళ్లి భోజనాన్ని వడ్డించుకుని రుచి చూశారు. క్యాంటీన్‌కు వచ్చే వారికి నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. రోజూ ఒకే కూర, రుచి లేని భోజనంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





