
సోనిపట్ (హరియాణా): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా( BJP )తో ఎలాంటి పొత్తు ఉండదని భారత రాష్ట్ర సమితి ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) స్పష్టం చేశారు. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. ‘భాజపాతో ఎలాంటి పొత్తు ఉండదు’ అని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అంశంపై మాట్లాడుతూ.. లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి బీఆర్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు. ‘‘ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు ఎలాంటి సమస్య ఉండదు’’ అని పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), సాంకేతిక మార్పులపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రతి సాంకేతిక మార్పును ప్రశ్నించారు.. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగాలి’’ అని అన్నారు. కేటీఆర్‌ తన ప్రసంగంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించారు. సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలోని కరవు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్ పరిష్కారం ఈ ప్రాజెక్టు అని అభివర్ణించారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-15లో సుమారు 44.4 లక్షల టన్నులు ఉంటే.. 2023-24లో అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





