
ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రత్యర్థులు ప్రయోగించిన డ్రోన్లు దూసుకొస్తున్నాయని భ్రమించి ఒక దేశం యుద్ధవిమానాలు హడావుడిగా గాల్లోకి ఎగిరాయి. కానీ దగ్గరకు వెళ్లిన తర్వాతగానీ అసలు విషయం బోధపడలేదు (Jets Scramble To Intercept Drone). అవి డ్రోన్లు కాదని పక్షుల గుంపు అని తెలుసుకొని పైలట్లు అవాక్కయ్యారు. గగనతలంలో నాటో సభ్యదేశానికి ఎదురైన వింత పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లిథువేనియా దేశంలో ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు స్థావరం ఉంటుంది. నాటో బాల్టిక్ ఎయిర్‌ డిఫెన్స్ మిషన్‌ కోసం దానిని ఏర్పాటు చేశారు. బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా వైమానిక రక్షణను (Air Defence) పర్యవేక్షించడం కోసం అది పనిచేస్తుంది. ఈ దేశాలకు సొంతంగా యుద్ధ విమానాలు లేవు. నాటో సభ్య దేశాలు వంతుల వారీగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తమ యుద్ధ విమానాలు, సిబ్బందిని పంపి గస్తీ నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో కొన్నేళ్లుగా ఐరోపాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు దేశాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఈ తరుణంలో నాటో కూటమి దేశాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి. తాజాగా గగనతలంలో అనుమానాస్పద కదలికలను రాడార్ వ్యవస్థలు గుర్తించాయి. దాంతో కమాండ్ సెంటర్ తక్షణమే స్పందించింది. అది డ్రోన్ల దండు కావొచ్చనే అనుమానంతో వాటిని అడ్డగించేందుకు యుద్ధ విమానాలను (NATO Jets) పంపించింది. రాడార్ అందించిన సమాచారం ఆధారంగా పైలట్లు ఆ దండు సమీపంలోకి వెళ్లాకగానీ అసలు విషయం వెల్లడికాలేదు. అక్కడ మోటార్లు, ప్రొపెల్లర్లు, నిఘా పరికరాలు ఏవీ లేవు. ఒక క్రమంలో వెళ్తున్న పక్షులు మాత్రమే కనిపించాయి. ఈ గుంపు పక్షులని (Birds) తేలడానికి ముందు లిథువేనియా విల్సియస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేసింది. విషయం తెలిశాక 38 నిమిషాల్లో ఆ అలర్ట్‌ను ఎత్తివేసింది. రాడార్ రీడింగ్స్‌లో పక్షులు, డ్రోన్ల సిగ్నేచర్‌ ఒక్కోసారి ఒకేరకంగా ఉండే అవకాశాలు ఉంటాయని కమాండ్ సెంటర్ వివరణ ఇచ్చింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





