
Mmbai Conamn | తనను ఎవరూ గుర్తుపట్టకుండా విగ్గు పెట్టుకుని, మారుపేర్లతో తప్పించుకు తిరుగుతున్న 56 ఏండ్ల రోషన్ భూషణ్ షేత్ (Roshan Bhushan Sheth) అనే ముంబై మోసగాడిని గుజరాత్లో అరెస్ట్ చేసినట్లు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సోమవారం వెల్లడించారు. స్టాక్ మార్కెట్ పేరుతో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై 5 శాతం రాబడి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వారిని నమ్మించేందుకు తప్పుడు లాభాల సర్టిఫికెట్లను సృష్టించి బాధితులకు చూపించేవాడు. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 42 మంది బాధితుల నుంచి రూ. 30.26 కోట్లు వసూలు చేశాడు. ఈ బాధితుల్లో ఒక ఎన్నారై మహిళ కూడా ఉన్నారు. ఆ డబ్బులతో విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు, గడియారాలను కొనుగోలు చేశాడు. విలాసవంతంగా జీవించాడు. ఏప్రిల్‌లో కండివాలికి చెందిన 60 ఏండ్ల సంజయ్ హీరాలాల్ షా రోషన్ భూషణ్ తన కుటుంబాన్ని రూ. 10.81 కోట్లకు మోసం చేశాడని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ‘ఇన్వెస్టాక్ (Investok)’ పేరుతో యాప్‌ను రూపొందిస్తానని చెప్పి 2020లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన హీరాలాల్ షా కుమారుడితో స్నేహం ఏర్పరచుకున్నాడు. తరువాత ఆ కుటుంబాన్ని భారీగా పెట్టుబడి పెట్టేలా ఒప్పించాడు. అలాగే పలు అపార్ట్మెంట్లలో సమావేశాలు నిర్వహించి తప్పుడు పత్రాలతో ఇతరులను ఆకర్షించి డబ్బులు వసూలు చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు రూ. 3.8 కోట్లు వాయిదాల్లో చెల్లించి 2025, డిసెంబర్ నుంచి చెల్లింపులను నిలిపివేసి ఏప్రిల్ నుంచి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాంకేతికతను వినియోగించి రోషన్ భూషణ్ గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉన్న ఓ భవనంలో ఉన్నట్టు గుర్తించారు. జూలైలో పోలీసులు హౌస్‌కీపింగ్ సిబ్బంది వేషంలో అపార్ట్మెంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడిపై విచారణ జరిపిన పోలీసులు విగ్, మూడు మారుపేర్లతో ఉన్న ఐడెంటిటీలను గుర్తించారు. వయసులో ఉన్నప్పుడు జయేష్ హన్ముఖ్ భాయ్ షా, ఢిల్లీలో రాహుల్ అతుల్ భాయ్ పరేఖ్, ముంబైలో రోషన్ భూషణ్ షేత్ పేర్లతో చెలామణి అయ్యాడు. అతడి నుంచి ఒక బీఎండబ్ల్యూ, ఒక మెర్సిడెస్, ఒక మహీద్ర థార్ కార్లు, 14 లగ్జరీ వాచీలు, రూ. 1.67 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 17 లక్షల నగదు, మూడు నివాస ఆస్తులను జప్తు చేశారు. విగ్‌ను తయారు చేసిన సెలూన్ సిబ్బందితో సహా 37 మంది సాక్షులు అతడిని గుర్తించడంతో సెప్టెంబర్ 1న చార్జిషీట్ దాఖలు చేశారు.





