
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కొనుకున్న సొంతింటిపై ప్రభుత్వం నిలువునా నీళ్లు చల్లింది. అన్ని అనుమతులూ ఉన్నాయని నమ్మి, జీవితకాల సంపాదనను ధారపోసి కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను రాత్రికి రాత్రే ‘22-ఏ’ (నిషేధిత భూముల) జాబితాలో చేర్చి సామాన్యుడి మెడకు ప్రభుత్వం ఉరితాడు బిగించింది. దశాబ్దాలుగా నివాసముంటున్న కాలనీలను సైతం నిషేధిత జాబితాలో పెట్టి చేతులెత్తేయడంతో వేలాది కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆంక్షల పరిధిలోకి నెట్టిన నివాస ప్రాంతాల డాటా చూస్తే కాంగ్రెస్ మారు పాలన సంబంధిత కాలనీ వాసుల్లో గుబులు పుట్టిస్తున్నది. చట్టసభల వేదికగా తమ సమస్యలకు పరిషారం దొరుకుతుందని ఆశగా ఎదురుచూసిన సామాన్యుడి నెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పనికిమాలిన నిర్ణయం తీవ్రంగా వేధిస్తున్నది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ వేదికగా వెల్లడించిన ‘22ఏ’ నిషేధిత జాబితా కాలనీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పుడు నిర్ణయాలు, చారిత్రక తప్పిదాలకు తాము బలికావాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ఒక మేడ్చల్ జిల్లాలోనే ఏకంగా 10,395 ఇండ్లను నిషేధిత (22ఏ) జాబితాలో పెట్టి యజమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. దేవేందర్‌నగర్‌లో ఏకంగా 1,080 ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టగా.. రేణుకానగర్ , వినోభానగర్, తారకరామానగర్ , శ్రీ సాయిరామ్‌నగర్, కృష్ణ హిల్స్, కాకతీయనగర్ సహా మరో 18 కాలనీల్లోని 5,118 ఇండ్లకు ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ఉప్పల్‌లోని బీజేఆర్నగర్, లక్ష్మీనరసింహకాలనీలో 1,623 ఇండ్లు, జైపురికాలనీలో 574 ఇండ్లను రెవెన్యూ ఆంక్షల సుడిగుండంలోకి నెట్టేశారు. కుత్బుల్లాపూర్ పరిధిలో గణేశ్‌నగర్‌లోని 1,000, కనకదుర్గానగర్‌లోని మరో 1,000 ఇండ్లు ఈ రెవెన్యూ ఆంక్షలతో విలవిలలాడుతున్నాయి. బాధితులు ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లు ఆగడం లేదు. ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు వేసి, మున్సిపల్ పన్నులు వసూలు చేస్తూ, సకల సౌకర్యాలు కల్పించిన సరారే.. ఇప్పుడు తమ ఆస్తులను నిషేధిత జాబితాలో చూపడంపై భగ్గుమంటున్నారు. ప్రజాప్రతినిధులు సభలో సమస్యను పరిషరించాల్సింది పోయి, ఇండ్లను జాబితాలో చూపించి చేతులు దులుపుకోవడంపై నిరసన తెలుపుతున్నారు. తక్షణమే ఈ నిషేధిత ఆంక్షలను తొలగించకపోతే సచివాలయంతో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాల వేళ కాలనీల్లోని గణపతి మండపాలు 22-ఏ బాధితుల చర్చలతో హోరెత్తుతున్నాయి. పూజలు, తీర్థప్రసాదాల కంటే తమ ఆస్తుల భవిష్యత్తు ఏమిటనే ఆందోళనతోనే కనబడుతున్నారు. మా ఇల్లు మనదేనా? లేదా ప్రభుత్వానిదా? అని భయపడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండపాల వద్ద భక్తులు, కాలనీవాసులు ఆక్రోశం వెళ్లగకుతున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే భూములను నిషేధిత జాబితాలో పెట్టింది. తమ భూములకు సంబంధించి ఎలాంటి యూఎల్సీ వర్తించదని గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా మొత్తం 19 ఎకరాలను 22-ఏ (డీ) జాబితాలో చేర్చడం ఎంతవరకు సబబు. సర్వే నంబర్లు 329, 336, 337 లోని 2.18 ఎకరాల స్థలానికి సంబంధించి రూ.50 లక్షలు చెల్లించి నాలా కన్వర్షన్ చేయించాం. అయినా ఈ స్థలాన్ని కూడా 22-ఏలో చేర్చారు. -సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, కాప్రా, ఉప్పల్ నియోజకవర్గం ఏన్నో ఏండ్లుగా మాదాపూర్‌లోనే నివాసం ఉంటున్నం. మా పేరు మీద రికార్డులు ఉన్నప్పటికీ హఠాత్తుగా 22ఏలోకి చేర్చడం వల్ల మా ఆస్తిని భవిష్యత్‌లో పిల్లల పేరిట చేయడం కాని, గిఫ్ట్ డీడ్ రాయడం వంటివి కుదరదు. ప్రైవేట్ స్థలాల్లో అన్ని అనుమతులతో కొనుగోలు చేసినా మాకు తిప్పలు తప్పడం లేదు. అన్ని హక్కులు పొంది ఇండ్లు కట్టుకున్నా వాటిని ప్రభుత్వం 22ఏ జాబితాలోకి చేర్చి ఇబ్బందులు పెట్టడం సరికాదు. – మధుసూదన్‌రెడ్డి, మాదాపూర్ చట్ట ప్రకారమే భూములను కొని ఇండ్లు కట్టుకున్నం. ఇప్పుడు మా భూములను నిషేధిత జాబితాలో పెట్టిన్రు. సర్దార్ పటేల్‌నగర్‌లో స్థలాలు, ఇంటి నిర్మాణాలకు 2008లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌తో క్రమబద్ధీకరణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక అనుమతులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. – కృష్ణంరాజు, సర్దార్ పటేల్ నగర్, కోశాధికారి





