
ఆలయాల్లో ఈవోలు, సిబ్బంది కొరత పర్యవేక్షణ కొరవడి గాడితప్పుతున్న వ్యవస్థ న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం జిల్లాలోని దేవాలయాల్లో పాలన గాడి తప్పుతోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో ఇన్‌ఛార్జులతో పలు ఆలయాలను నెట్టుకొస్తున్నారు. ఈవోల కొరత కారణంగా పర్యవేక్షణ కొరవడి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దేవుడి మాన్యాలు, భక్తులిచ్చే విరాళాల రూపంలో ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి అంతంతమాత్రంగా ఉంటోంది. ఆలయాల ఆస్తులు సైతం అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలో గ్రేడ్‌-1 ఈవోలు ఇద్దరు అవసరం కాగా.. పాతపట్నం నీలమణి దుర్గమ్మ దేవస్థానం ఈవో వాసుదేవరావు ఒక్కరే ఉన్నారు. గ్రేడ్‌-2 పోస్టులో ఉన్న ఏడుగురిలో ఒకరు ఉద్యోగ విరమణ చేశారు. నవంబరులో మరొకరు రిటైర్‌ కాబోతున్నారు. గ్రేడ్‌-3 ఈవోలు 13 మందికి తొమ్మిది మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 20 ఆలయాల బాధ్యతలు చూస్తున్నారు. నెలకోసారి కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న దాఖలాల్లేవు. కొందరు ఉన్నతాధికారుల అండదండలతో జిల్లా కేంద్ర కార్యాలయంలోనే ఉండిపోతుండటంతో ఆ ప్రభావం పాలనపై పడుతోంది. తగ్గితే మరిన్ని కష్టాలు..: జిల్లాల పునర్విభజన తర్వాత దేవాదాయశాఖలో ఈవోల పోస్టులు మరింత తగ్గిపోయాయి. ఆ జీవో అమలైతే మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం 30 మండలాలకు గ్రేడ్‌-1 పోస్టు ఒకటి, గ్రేడు-2 3, గ్రేడు-3 పోస్టులు 9 మాత్రమే ఉండనున్నాయి. ఒక మండలంలోని ఆలయాలకు ఒక్కరే ఈవోను నియమించి బాధ్యతలు అప్పగించాలని 2022లో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. ఎక్కువ దేవస్థానాలున్న చోట్ల రెండుగా విభజించి ఇద్దరికి కేటాయించాలని పేర్కొన్నారు. ఒక మండలంలో పని చేసే అధికారిని మరో రెగ్యులర్‌ ఈవో పరిధిలోని ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా నియమించకూడదని మార్గదర్శకాలిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈవోల కొరత ఉన్న మాట వాస్తవమే. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల్ని ఉన్నతాధికారులకు నివేదించాం. సోంపేట, మందస, టెక్కలి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఆలయాల పాలన ఇబ్బందిగా ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ జరిగితే సమస్య పరిష్కారమవుతుంది. బీఆర్‌వీవీ ప్రసాద్‌ పట్నాయక్, జిల్లా సహాయ కమీషనర్, దేవాదాయశాఖ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





