
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు ఏడాదికి పైనే అవుతోంది. ప్రస్తుతం ఎక్కువగా కార్ రేసింగులపైనే దృష్టి సారిస్తున్నారీ సీనియర్ హీరో. తాజాగా యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసింగులో పాల్గొన్నారు అజిత్. తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ సైతం ఈ పోటీలకు హాజరై తిలకించారు. అలాగే హీరోయిన్ త్రిష కూడా ఈ పోటీల్లో సందడి చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత విజయ్- అజిత్ కలిసి కనిపించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇదే కార్ రేసింగ్ ఈవెంట్ లో ఓ అభిమాని పట్ల హీరో అజిత్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా అజిత్ తీరును తప్పుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రేసింగ్ పూర్తయ్యాక నడుచుకుంటూ వస్తోన్న అజిత్ తో కలిసి ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అది కూడా దూరం నుంచే.. అయితే దీనిని గమనించిన అజిత్ బాగా సీరియస్ అయ్యారు. అభిమాని వైపు కోపంగా చూస్తూ కనిపించారు. దీంతో సదరు అభిమాని కూడా అజిత్ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.





