
ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌదీ అరేబియాలోని ఓ అమెరికా స్థావరంపై ఇటీవల ఇరాన్‌ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. దీని వెనుక రష్యా నిఘా సాయం ఉన్నట్లు సమాచారం. అగ్రరాజ్య మిలిటరీ బేస్‌కు సంబంధించిన సమాచార సేకరణకు రష్యా ( Russia )కు చెందిన 14 ఉపగ్రహాలు పనిచేశాయట. ఈ మేరకు అమెరికా ( USA ) నిఘా వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఇటీవలి కాలంలో రష్యా-ఇరాన్‌ (Russia-Iran) పరస్పరం రక్షణ సహకారాన్ని విస్తరించుకున్నాయి. ఇందులో భాగంగానే టెహ్రాన్‌కు శాటిలైట్‌ సమాచారం, అధునాతన ఆయుధ సాంకేతికతను మాస్కో అందిస్తోంది. రష్యా అందించిన ఉపగ్రహ డేటాతో అమెరికా సైనిక స్థావరాల లొకేషన్లు, అక్కడి కార్యకలాపాల గురించి ఇరాన్‌ ( Iran ) తెలుసుకుంటోందని సదరు కథనం పేర్కొంది. దీంతో అత్యంత కచ్చితత్వంతో టెహ్రాన్‌ దాడులు (US-Iran War) చేయగలుగుతోందని వెల్లడించింది. భవిష్యత్తులోనూ అమెరికా బేస్‌లు, కమాండ్‌ సెంట్రల్‌, నేవీ మౌలిక సదుపాయాలపై దాడులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఇరాన్‌ మధ్య సైనిక సంబంధాలు ఏళ్ల నుంచే ఉన్నాయి. 2022లో మాస్కోకు టెహ్రాన్‌ చౌకైన షాహెద్‌ డ్రోన్లను అందించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు అవి ఎంతగానో దోహదపడ్డాయి. దీంతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడింది. ఆ తర్వాత షాహెద్‌ డ్రోన్లను సొంతంగా తయారుచేసుకునేందుకు మాస్కో లైసెన్స్‌ కూడా పొందింది. ఇక, ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన తర్వాత నుంచి టెహ్రాన్‌కు రష్యా రక్షణపరంగా సాయం అందిస్తోంది. డ్రోన్ల ఆధునికీకరణతో పాటు, ఇరాన్‌ అభివృద్ధి చేస్తోన్న మిసైల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థల తయారీలో సాయం చేసేందుకు మాస్కో తమ నిపుణులు, ముడి సరుకులను పంపించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. నిఘా సమాచారాన్ని పంచుకోవడం, రక్షణ సహకారం కోసం ఇరు దేశాల మధ్య గతేడాది ఒప్పందం కూడా కుదిరింది. ఉక్రెయిన్‌తో గత నాలుగేళ్లకు పైగా రష్యా యుద్ధం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో కీవ్‌కు అమెరికాతో పాటు పలు పశ్చిమ దేశాలు ఆయుధ సాయం చేస్తున్నాయి. ఇప్పుడు దానికి ప్రతీకారంగానే ఇరాన్‌తో రష్యా తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. US-Russia: సౌదీ అరేబియాలోని ఓ అమెరికా స్థావరంపై ఇటీవల ఇరాన్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది.