
ఇంటర్నెట్‌ డెస్క్: క్యాబ్‌ బుక్‌ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్‌ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని.. ఇదో అన్యాయ వ్యాపార పద్ధతి అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే (Nidhi Khare) తెలిపారు. రైడ్‌ పూర్తయిన తర్వాత టిప్‌ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ముందుగా టిప్‌ ఇవ్వకపోతే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయరు అనే భావన ప్రయాణికులకు కలిగించొద్దని చెప్పారు. ఈ అంశంపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌(CCPA)కు అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ర్యాపిడో(Rapido)పై సీసీపీఏ చర్యలు తీసుకుంది. రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్‌ బుకింగ్‌ సమయంలో అదనంగా రూ.10, రూ.20, రూ.30 యాడ్‌ చేయాలని యాప్‌ సూచిస్తున్నట్లు గుర్తించింది. ఎక్కువ మొత్తం చెల్లిస్తే రైడ్‌ లభించే అవకాశం పెరుగుతుందని సందేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది. రైడ్‌ బుకింగ్‌ సమయంలోనే దూరం, సమయం, ట్రాఫిక్‌, టోల్‌ వంటి వివిధ అంశాల ఆధారంగా ఛార్జీ నిర్ణయిస్తారని సీసీపీఏ తెలిపింది. ఆ తర్వాత అదే రైడ్‌కు అదనంగా చెల్లించాలని కోరడం సమర్థనీయం కాదని పేర్కొంది. ఈ విషమమై ఉబర్‌, ఓలాపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని నిధి ఖరే తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




