
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి నేటి నుంచి పూజలందుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనులై ఉంటారు. కుడి వైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయం, ఎడమవైపు పాశం, పరుషు, మాల, మొదకం ఉంటుంది. అలాగే స్వామి వారి కుడివైపు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన సోమనాథుడి లింగం, ఎడమవైపు మండపంలోఅష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సుమారు 700 మంది పోలీసు సిబ్బంది శాంతిభద్రతల విధుల్లో ఉంటారు. తొలి పూజకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్‌కుమార్ తెలిపారు.




