
ఠాణె: భూవివాదంలో ప్రధాని మోదీ పాఠశాల మిత్రుడు 81 ఏళ్ల అస్గర్‌అలీ వోహ్రాకు ఊరట లభించింది. ఈ వివాదం నుంచి వెనక్కి తగ్గిన భాజపా ఎమ్మెల్యే.. ప్రధాని స్నేహితుడికి భూమిని అప్పగించారు. ఈ వ్యవహారం గురించి అస్గర్‌ అలీ ఇటీవల మోదీని కలిసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని వాడ్‌నగర్‌ బీఎన్‌ స్కూల్‌లో ప్రధానితో పాటు వోహ్ర కూడా కలిసి చదువుకున్నారు. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నివసిస్తోన్న అస్గర్‌అలీ వోహ్రా.. గుజరాత్‌లోని భయందర్‌ ఈస్ట్‌ నవ్‌ఘర్‌ రోడ్డులో 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2011లో స్వయం బిల్డర్స్, సెవెన్‌ ఎలెవన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే రెండు సంస్థలు ఆక్రమించుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు సంస్థలతో భాజపా ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు సంబంధం ఉందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2015లో పోలీసులు దీనిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయగా.. 11ఏళ్ల తర్వాత ఇటీవల కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది ఆ రెండు సంస్థలు.. వోహ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వోహ్రా..ఈ నెల 8న ప్రధాని మోదీని కలిసి ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని అభ్యర్థించారు.ఈ కేసుపై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బుధవారం విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వోహ్రాతో భూవివాదం నుంచి ఆ రెండు సంస్థలు వెనక్కి తగ్గాయి. ఆయనపై కేసు ఉపసంహరించుకోవడంతో పాటు భూమిని తిరిగిచ్చేందుకు అంగీకరించాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




