
ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా శాలియాన్‌ మృతి కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును చేర్చడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తొలిసారి స్పందించారు. దిశా శాలియాన్‌ (Disha Salian)ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో కూడా తెలియదని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ కేసుతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. ‘‘రాజకీయ, వ్యక్తిగత దురుద్దేశాలు కలిగిన కొంతమంది నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు, వాస్తవాలూ లేకుండా ఈ దుష్ప్రచారాన్ని సాగిస్తుండటం దురదృష్టకరం. ఇటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు.. ప్రజల కోసం చేస్తున్న మా పోరాటాన్ని అడ్డుకుంటాయని అనుకోవడం విఫల వ్యూహమే అవుతుంది. మేం ఎల్లప్పుడూ సత్యం పక్షాన నిలబడతాం. రాజకీయ ప్రమేయం, వ్యక్తిత్వ హననాలకు తావు లేకుండా.. ఈ కేసు పునర్విచారణను సజావుగా సాగనివ్వండి’’ అని ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పేర్కొన్నారు. విధులకు వెళ్లకుండా రూ.70 వేల జీతం.. వివాదంలో ఎమ్మెల్యే మేనకోడలు దిశా శాలియాన్‌ 2020 జూన్‌ 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె చనిపోయిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించారు. దిశా మృతి కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ప్రభుత్వం.. దీన్ని కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. బాంబే హైకోర్టు ఇటీవల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, నటులు డినో మోరియా, రియా చక్రవర్తి పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.