
దేశంలోకి ఆయుధాలు, మత్తుపదార్థాల స్మగ్లింగ్‌ ఉగ్రసంస్థల్లోకి యువత రిక్రూట్‌మెంట్‌.. ఈ ముఠాపై నిషేధం విధిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ దిల్లీ: మన దేశంలో పలు హత్యలకు కుట్రపన్నడంతో పాటు సరిహద్దుల ఆవల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తోందనే తీవ్ర ఆరోపణలున్న, పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ (ఎస్‌బీఎన్‌)ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రసంస్థగా ప్రకటించింది. ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ-ఉపా) కింద నిషేధం విధిస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత్‌ నిషేధించిన ఉగ్రసంస్థల జాబితాలో ఎస్‌బీఎన్‌ 46వది. ‘అమాయకులైన యువతను రెచ్చగొట్టి ఉగ్రసంస్థల్లో చేరేలా ఎస్‌బీఎన్‌ సభ్యులు కుట్రపన్నుతున్నారు. స్థానిక నేరగాళ్లతో సంబంధాలు పెట్టుకుని ఆయుధాలు, మత్తుపదార్థాల స్మగ్లింగ్‌ సిండికేట్లను నిర్వహిస్తున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, మత సామరస్యం, అంతర్గత భద్రతలకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నారు. విద్వేషపూరిత డిజిటల్‌ కంటెంట్‌ వ్యాప్తి చేస్తున్నార’ని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఉపా, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాలు-పేలుడు పదార్థాల చట్టాల కింద ఇప్పటికే ఎస్‌బీఎన్‌ సభ్యులపై పలు కేసులు నమోదైన విషయాన్ని పేర్కొంది. పోలీస్, రక్షణ, మతపరమైన ప్రదేశాలను రెక్కీ చేసేందుకు, గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక మధ్యవర్తులకు షహజాబ్‌ భట్టీ నెట్‌వర్క్‌ డబ్బు చెల్లిస్తోంది. దిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్‌లో ఎస్‌బీఎన్‌ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌..షహజాద్‌ భట్టీ (45). దోపిడీలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కిరాయి హంతక ముఠానేతగా మారాడు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో కుమ్మక్కై ఉగ్రమూకలకు ఆయుధాల చేరవేత, మత్తుపదార్థాల స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. ప్రస్తుతం యూఏఈకి మకాం మార్చినప్పటికీ అక్కడి నుంచే తన నెట్‌వర్క్‌ ద్వారా పావులు కదుపుతున్నాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





