
నీట మునిగి ఆరుగురు విద్యార్థుల మృతి సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల నేరేడు చెరువులో ఘటన పటాన్‌చెరు అర్బన్‌: పటాన్‌చెరు రూరల్, న్యూస్‌టుడే: ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్న నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విగ్రహం ఒక వైపునకు ఒరిగి మీద పడడంతో నీట మునిగి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పురపాలిక పరిధిలోని శిరీష ట్రస్టు ఆశ్రమానికి చెందిన విద్యార్థులు బుధవారం సాయంత్రం వినాయకుడిని పెద్దకంజర్ల నేరేడు చెరువులో నిమజ్జనం చేస్తుండగా విగ్రహం అదుపు తప్పి మీద పడింది. దీంతో నర్సింహరాజు (22-వేమవరం-తూర్పుగోదావరి), సుమంత్‌రెడ్డి (17-ఖమ్మం), గణేశ్‌ (18-గీసుకొండ, వరంగల్‌), సిద్దార్థ్‌ (17-వరంగల్‌), శ్యాంకుమార్‌ (17-బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌), ఉదయ్‌కిరణ్‌ (17-విద్యానగర్, సంగారెడ్డి) నీట మునిగి ప్రాణాలొదిలారు. ఎనిమిది మంది విద్యార్థులు విగ్రహాన్ని చెరువులో లోతైన భాగానికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుండగా.. ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు వర్షిత్, అఖిల్‌లు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. దిగువకు వెళ్లడంతోనే ప్రమాదం..: మూడేళ్లుగా ట్రస్టుకు చెందిన వినాయక విగ్రహాన్ని ఇదే చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. వార్డెన్‌తో పాటు స్థానికులు చెరువు దిగువ భాగానికి వెళ్లవద్దని వారించినప్పటికీ విద్యార్థులు లోతైన భాగంలో నిమజ్జనం చేయాలని నిర్ణయించుకొని లోపలికి తీసుకెళ్లారు. అంతలోనే విగ్రహం ఒక వైపునకు ఒరిగి విద్యార్థులపై పడిపోయింది. స్థానికులు, ట్రస్ట్‌ నిర్వాహకులు హుటాహుటిన వారిని పటాన్‌చెరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆరుగురికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితంలేకపోయింది. ఏపీకి చెందిన కృష్ణంరాజు తన కుమార్తె శిరీష పేరిట ట్రస్టును ఏర్పాటుచేసి నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మొదట్లో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వసతి కల్పించేవారు. ప్రస్తుతం వారితోపాటు నిరుపేద విద్యార్థులను చదివిస్తున్నారు. విద్యార్థుల మృతిపై గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





