
ఈనాడు, హైదరాబాద్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బయో ఎనర్జీ విభాగం నుంచి హైదరాబాద్‌ సంస్థ బైక్‌వో గ్రీన్‌ టెక్‌ రూ.66.46 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుంది. 2033 జులై 31 వరకు చెల్లుబాటు అయ్యే ఒప్పందంలో భాగంగా బయోమాస్‌ నిర్వహణ కోసం లోడర్, క్యాచర్, గ్రాబర్‌ పరికరాలు అమర్చిన విద్యుత్తు ట్రాక్టర్లను ఈ సంస్థ సరఫరా చేయనుంది. వాహనాలు, పరికరాల కోసం రూ.27.15 కోట్లు, డ్రైవర్లు, నిర్వహణ సేవల కోసం రూ.39.31 కోట్లు కేటాయించారు. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ వేదికపై నమోదైన ఈ సంస్థ, వారెంట్ల జారీ ద్వారా రూ.70 కోట్లకు పైగా సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం సంస్థ వద్ద 3,000 వాహనాలుండగా, వచ్చే మార్చి చివరికి 10,000 కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. విమానాశ్రయ లాజిస్టిక్‌ విభాగాలకూ సేవలు విస్తరించేందుకు చూస్తున్నట్లు సంస్థ సీఈఓ హితెన్‌ పాల్‌ సక్లానీ వెల్లడించారు. సలహామండలి సభ్యుడు సుమంత్‌ బాడిగ మాట్లాడుతూ.. పారిశ్రామిక లాజిస్టిక్స్‌ రంగంలో విద్యుత్‌ వాహనాల వినియోగం కొత్త అవకాశాలు సృష్టిస్తుందని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





