
Vineet Minocha : కాన్పూర్ (Kanpur) కు చెందిన ఫార్మా వ్యాపారి (Pharma Business Man) వినీత్ మనోచా (Vineet Manocha) హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షూటర్.. హతుడు వినీత్ కుమారుడు సుబ్రత్ (Subrath) కు ఆరుసార్లు ఫోన్ చేసినట్లు వెల్లడైంది. దాంతో హత్యలో అతడి పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ హత్య వెనుక లోతైన కుట్ర కోణం ఉండవచ్చని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 5న మనోచా హత్య జరగగా అంతకు రెండు రోజుల ముందే నిందితుడు విశాల్ గౌతమ్ కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. ఆ కొత్త నెంబర్ నుంచే సుబ్రత్‌కు ఆరుసార్లు కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే నెంబర్‌తో మనోచా కోడలు షాలుతో కూడా నిందితుడు మాట్లాడినట్లు తేలింది. హత్య కోసమే ప్రత్యేకంగా సేకరించిన సిమ్ నుంచి సుబ్రత్‌కు ఎందుకు కాల్స్ వెళ్లాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ వెల్లడించారు. మే 1 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కాలంలో సుబ్రత్, షాలు, విశాల్‌కు చెందిన ఏడు మొబైల్ నెంబర్ల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మే 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్య సుబ్రత్, విశాల్ ఏకంగా 309 సార్లు మాట్లాడుకున్నట్లు కాల్ రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే మనోచా కోడలు షాలు, షూటర్ విశాల్ గౌతమ్, అతని స్నేహితుడు రాజ్ కిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాలు సూచన మేరకే తాను ఈ హత్యకు పాల్పడ్డానని, ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ.6 లక్షల నగదుతోపాటు ఉద్యోగం ఇస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు విశాల్ వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం షాలు, విశాల్‌ను కస్టడీకి కోరిన పోలీసులు.. వారిని విచారించిన అనంతరం సుబ్రత్‌ను కూడా ప్రశ్నించాలని యోచిస్తున్నారు. ఆస్తి పత్రాలు, 2022లో రాసిన వీలునామాతోపాటు సుబ్రత్ అప్పుల్లో ఉన్నాడన్న సమాచారాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.





