
ఆర్‌సీఎమ్‌సీ అవసరం లేదు కొరియర్‌/పోస్టల్‌ చేసేవారికి ప్రయోజనం దిల్లీ: రూ.3 లక్షల వరకు విలువైన షిప్‌మెంట్‌లపై ఎగుమతిదార్లకు రిజిస్ట్రేషన్‌ కమ్‌ మెంబర్‌షిప్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీఎమ్‌సీ) పొందాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తద్వారా కొత్త, చిన్న ఎగుమతిదార్లకు నిబంధనల భారాన్ని తగ్గించినట్లయిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పోస్టల్, కొరియర్, మరిన్ని మార్గాల్లో విదేశాలకు పంపే షిప్‌మెంట్‌లకు ఈ చర్య ఉపకరిస్తుందనీ తెలిపింది. రూ.3 లక్షలకు పైబడ్డ కన్‌సైన్‌మెంట్‌లకు ఆర్‌సీఎమ్‌సీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. 43% బిల్లుల్లో రూ.3 లక్షల్లోపు ఎగుమతులే ఉన్నాయని, అయితే మొత్తం మర్చండైజ్‌ ఎగుమతి విలువలో ఇవి 0.86 శాతంలోపేనని ఆ శాఖ వివరించింది. ఆర్‌ఓడీటీఈపీ పథకం పొడిగింపు!: ఎగుమతిదార్లకు కేంద్రం ఊరట కల్పించే అవకాశం ఉంది. ఎగుమతి ఉత్పత్తులపై చెల్లించే సుంకాలు, పన్నులను తిరిగి చెల్లించే ఆర్‌ఓడీటీఈపీ పథకాన్ని అయిదేళ్ల పాటు పొడిగించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కోరింది. వాస్తవానికి ఈ పథకం సెప్టెంబరు 30తో ముగియనుంది. ఈ అంశంపై వాణిజ్య శాఖ ఇప్పటికే వ్యయాల విభాగంతో చర్చించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద స్థానిక/రాష్ట్ర/కేంద్ర స్థాయిలో ఎటువంటి రీఎంబర్స్‌మెంట్‌ పొందని ఎగుమతి ఉత్పత్తులపై సుంకాల రిఫండ్‌ అందజేస్తున్నారు. 2025-26లో ఈ పథకానికి రూ.18,232 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్లు కేటాయించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




