
టీజీసీఎస్‌బీ చొరవతో సైబర్‌ నేరాల బాధితులకు ఊరట ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌నేరాల బారిన పడిన బాధితులకు ఊరట కలిగించే విషయంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) ప్రతిభ కనబరుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 24,189 మంది బాధితులకు ఏకంగా రూ.139.68 కోట్లను తిరిగి ఇప్పించగలిగింది. ఇటీవల జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో రాష్ట్ర న్యాయసేవల సంస్థ.. 3,896 మందికి రూ.42.28 కోట్లు ఇప్పించింది. లోక్‌ అదాలత్‌లతోపాటు కేంద్ర హోంశాఖ మేలో ప్రారంభించిన మనీ రిస్టొరేషన్‌ మాడ్యూల్‌(ఎంఆర్‌ఎం)ను విస్తృతంగా వినియోగించడం ద్వారా బాధితులకు సొమ్ము వెనక్కి వస్తోంది. తెలంగాణలో ఈ మాడ్యూల్‌ ఈ ఏడాది జూన్‌లో అమల్లోకి వచ్చింది. దీంతో రూ.50 వేలలోపు సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేందుకు కోర్టు ఉత్తర్వుల అవసరం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే జూన్‌ నుంచి శనివారం వరకు ఇలా 9,355 మంది బాధితులకు రూ.27.33 కోట్లను రిఫండ్‌ చేశారు. టీజీసీఎస్‌బీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 73,204 మంది బాధితులకు రూ.514.93 కోట్ల వరకు ఇప్పించడం విశేషం. ఎవరైనా సైబర్‌ నేరాల బారినపడి సొమ్మును పోగొట్టుకుంటే తక్షణమే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫోన్‌ చేస్తే ఉపశమనం కలిగే అవకాశముందని టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




