
వైద్యులుగా అర్హత లేని వ్యక్తుల చెలామణి నానక్‌రాంగూడ భాస్కర క్లినిక్‌లో తనిఖీలు చేపట్టిన టీజీఎంసీ సభ్యులు డా.జి.శ్రీనివాస్, డా.వి.నరేష్‌కుమార్, డా.కె.యు.ఎన్‌.విష్ణు ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) హైదరాబాద్‌లోని పలు క్లినిక్‌లు, ఆసుపత్రుల్లో ఆదివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూశాయి. అర్హతలు లేకుండా వైద్యంచేయడం, టీజీఎంసీ రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా క్లినిక్‌ల నిర్వహించడంతోపాటు పలు లోపాలు బయటపడ్డాయి. కౌన్సిల్‌సభ్యులు డా.జి.శ్రీనివాస్, డా.వి.నరేష్‌ కుమార్, డా.కె.యు.ఎన్‌.విష్ణు నానక్‌రాంగూడ, కోకాపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో తనిఖీలు నిర్వహించారు. నానక్‌రాంగూడ భాస్కర క్లినిక్‌: బీఏ విద్యార్హతతో భాస్కర్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. జ్వరం లేని రోగికి 101 డిగ్రీల జ్వరం ఉన్నట్లు చెప్పి, చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. సాయిగణేశ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌: ఇంటర్‌విద్యార్హతతో నారాయణ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. అర్హతలులేకుండా పడకలు ఏర్పాటు చేసి, వైద్యం చేస్తున్నారు. మదర్‌ ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌: వైద్యఅర్హతలు లేకుండా ఇంటర్‌ చదివిన దిలీప్‌ వైద్యం చేస్తున్నారు. కోకాపేటలోని సాయిక్లినిక్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ విద్యార్హత అని చెప్పిన రాజశేఖర్‌.. ఆర్‌డీఏ, డీసీఏ రిజిస్ట్రేషన్లు లేకుండా వైద్యం అందిస్తున్నారు. శేరిలింగంపల్లిలోని శ్రేయా ఆసుపత్రి: డాక్టర్‌ పి.శరత్‌బాబు ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌గా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌ అర్హతకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ లేకుండానే, ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌ పూర్తిచేసినట్లు అధికారులకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గోల్కొండ పిషా క్లినిక్‌: ఎం.షబ్బీర్‌ హుస్సేన్‌ తన విద్యార్హత బీయూఎంఎస్‌ అని చెబుతూ అవసరమైన రిజిస్ట్రేషన్‌ లేకుండానే వైద్యం చేస్తున్నారు. అధిక మోతాదు కలిగిన యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు గుర్తించారు. ఇలాంటి మందుల నిల్వ, వినియోగం, పంపిణీకి అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతి లేదని కౌన్సిల్‌ గమనించింది. రాజేంద్రనగర్‌ హెల్త్‌కేర్‌ క్లినిక్‌: ఫరూక్‌ ఇంటర్‌ విద్యార్హతతో, గజాలా బీయూఎంఎస్‌ విద్యార్హతతో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. అవసరమైన వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా చికిత్స అందిస్తున్నట్లు కౌన్సిల్‌ గమనించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




