
China Army : భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణశాఖ (Defence Ministry) వెల్లడించింది. 2025లో ఉత్తర సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) మోహరింపులు భారీగా తగ్గినట్లు తన వార్షిక నివేదిక (2025-26) లో పేర్కొన్నది. 2020లో తూర్పు లద్దాఖ్ (Ladakh) లో వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ఘర్షణలు జరిగిన తర్వాత 2024లో ఆయా ప్రాంతాల నుంచి రెండు దేశాల సైనిక దళాల ఉపసంహరణకు అవగాహన కుదిరింది. ఈ విషయంపై గత ఏడాది ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య చర్చలు జరిగాయి. దాంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొంత మేరకు ఉపశమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా సరిహద్దులకు ఇరువైపులా 10 చొప్పున కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్ల (సుమారు 40,000-50,000 మంది సైనికులను) ను మోహరించింది. అంతకుముందు కేవలం సెక్టార్లోనే 60,000 పైగా చైనా సైనికులు ఉండేవారు. బీజింగ్ తన మోహరింపులను తగ్గించినప్పటికీ భారత్ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ (LAC) పొడవునా అన్ని సెక్టార్లలో పటిష్టమైన సైనిక వ్యూహాన్ని, సంసిద్ధతను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న రాజకీయ, దౌత్య చర్చలవల్లే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి, స్థిరత్వం నెలకొందని తెలిపింది. భారత సైన్యం అవిశ్రాంత కృషివల్ల జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలు నెలకొన్నాయని రక్షణశాఖ తన నివేదికలో పేర్కొన్నది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది. కశ్మీర్ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని, ప్రభుత్వం, భారత సైన్యం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపింది. దాంతో కశ్మీర్లో రాళ్ల దాడులు, నిరసనలు, హింసాత్మక ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్ముకశ్మీర్లో, నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి గణనీయంగా మారిందని పేర్కొన్నది.




