
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ సమరానికి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఇందులో 12 ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ పోరుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది.





