
బాలుడి తల్లి మౌలాబీ ఆత్మహత్య దురదృష్టకరం:ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఒంగోలు నేరవిభాగం, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థి తౌషిక్‌ అనుమానాస్పద మృతిపై పారదర్శకంగా దర్యాప్తు జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఆ ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలుడి తల్లి మౌలాబీ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసి, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో శనివారం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ఎస్పీ ఒంగోలులో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘మౌలాబీ ఆత్మహత్య దురదృష్టకరం. బాలుడు తౌషిక్‌ మృతిపై పోలీసు శాఖ దర్యాప్తు పారదర్శకంగా సాగింది. ఈ క్రమంలో ఆమె పలుమార్లు కోచింగ్‌ సెంటర్‌ వద్ద ఆందోళనకు దిగటం, ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యం చెప్పారు. మేము రాసిన లేఖతోనే సదరు కోచింగ్‌ సెంటర్‌ను మూసివేశారు. యాజమాన్యం కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకుంది. ఈ నెల 10న మౌలాబీ ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో అక్కడున్న మా సిబ్బంది వారించేందుకు తీవ్రంగా యత్నించారు. ఎస్సై వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఒంగోలు తరలించారు. ఈ విషయంలో కొన్ని సంఘాలు, కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు’ అని తెలిపారు. కోచింగ్‌ సెంటర్‌ అనుమతులు రద్దు చేస్తూ డీఈవో రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మౌలాబీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆమె కుటుంబ సభ్యులు సహకరించడం లేదని సింగరాయకొండ సీఐ శ్రీహరి తెలిపారు. కోచింగ్‌ సెంటర్‌ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




