
Oracle layoffs | ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ రావడం మొదలైనట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది. తాజా లేఆఫ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. ఈ తాజా రౌండ్లో ప్రభావితమైన ముగ్గురు ఉద్యోగులతో మాట్లాడినట్లు, అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన నోటిఫికేషన్‌ను పరిశీలించినట్లు బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది. అయితే తాజా లేఆఫ్స్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపడం ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. “Today is your last working day” అంటూ ఆ మెయిల్స్ ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, అందులో భాగంగా సంబంధిత ఉద్యోగుల పోస్టులను తొలగించినట్లు ఈమెయిల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగి పనితీరు లేదా వ్యక్తిగత కారణాలను ప్రస్తావించకుండా.. “Oracle’s current business needs” ఆధారంగా ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు మెయిల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు వారి సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం.. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన తర్వాత కంపెనీ సెవరెన్స్ ప్లాన్ నిబంధనలకు లోబడి పరిహారం అందుతుందని వివరించినట్లు సమాచారం.




