
రోజుకు 80 వేల మందికి దర్శనం బ్రేక్‌ దర్శనాలు రద్దు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్‌టుడే: ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలతోపాటు శ్రీవాణి టికెట్లను రద్దుచేసింది. దీనివల్ల ప్రతిరోజూ 2.30 నుంచి 3 గంటల సమయం ఆదా అవుతుంది. దాన్ని సాధారణ భక్తులకు కేటాయించనుంది. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించి, రోజుకు 79 వేల నుంచి 80 వేల మందికి మూలమూర్తి దర్శనం కల్పించేలా ఆటోమోడ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసింది. తిరుమలలోని 7,600 గదులతోపాటు వివిధ మఠాల్లోని 60 శాతం గదులు, కర్ణాటక చౌల్ట్రీలోని 145 గదులను తితిదే ఆధీనంలోకి తీసుకుంది. ముందస్తు బుకింగ్‌లు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయడంతో ఆ మేరకు గదులన్నీ మిగిలాయి. వాటిని సాధారణ భక్తులకే కేటాయించనుంది. లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా తితిదే చర్యలు తీసుకుంది. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు 8 లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా ఉంచుతుంది. కానీ ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు, వచ్చే నెల 12 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మధ్య 17 రోజులే ఉండటంతో... 10 లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా సిద్ధంచేసింది. ఈనెల 19న జరిగే గరుడ వాహన సేవకు 3 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఐసీసీసీ(కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)ను పూర్తిస్థాయిలో తితిదే వినియోగించుకోనుంది. 3,000 మంది పోలీసులు, 2,300 మంది విజిలెన్స్‌ సిబ్బంది, 1,000 మందికిపైగా తితిదే ఉద్యోగులు సమన్వయంతో పనిచేయనున్నారు. అత్యవసర వైద్యసేవలకు 14 అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతున్నారు. గరుడసేవ నాడు అదనంగా 4,000 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వర్తిస్తారు. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సుల్ని అందుబాటులో ఉంచుతోంది. గరుడసేవ రోజున 3,100 ట్రిప్పులు నడపనుంది. ఈసారి భక్తులు మాడవీధుల నుంచి బయటకు వచ్చే చోటే బస్సులు సిద్ధంగా ఉండేలా తితిదే మ్యాపింగ్‌ చేసింది. తిరుమలలో 5 వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించింది. అదనంగా లక్ష మందికి అన్న ప్రసాదాలు బ్ర హ్మోత్సవాల్లో రోజూ అదనంగా లక్ష మందికి అన్న ప్రసాదాలు అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. 1,000 మంది వంటవారు, సర్వర్లను అదనంగా నియమించింది. ఒకేసారి లక్ష పోర్షన్ల ఆహారం తయారీకి 22 భారీ పాత్రలను సిద్ధంచేసింది. సాధారణ రోజుల్లో 3 లక్షల మందికి అన్నదానం చేస్తుండగా.. గరుడసేవ నాడు 23 లక్షల పోర్షన్లను (భక్తులకు ఇచ్చే టీ, కాఫీ, పులిహోర, మజ్జిగ... ఇలా ప్రతిదాన్నీ ఒక పోర్షన్‌గా పరిగణిస్తారు) పంపిణీ చేస్తుంది. గ్యాలరీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలతోపాటు సాంబారన్నం, నిమ్మకాయ అన్నం, పులిహోర, బిస్కెట్లు, బాదంపాలు, మజ్జిగ, టెట్రా ప్యాక్‌ జ్యూసులు, టీ, కాఫీ తదితరాలను పంపిణీ చేయనుంది. సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించడమే లక్ష్యం - వెంకయ్య చౌదరి, తితిదే అదనపు ఈవో సా లకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ లేకుండా చూసేందుకు తితిదే అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గరుడసేవ రోజు లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ‘ఔటర్‌ రింగ్‌రోడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. ఇన్నర్‌ రింగ్‌రోడ్, గ్యాలరీలు నిండిపోయాక, బయట క్యూలైన్లలోని భక్తులకోసం.. స్వామివారి వాహనాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య మూలల్లో నిలిపి దర్శనం కల్పిస్తాం. దీనివల్ల గ్యాలరీల బయట ఉన్న మరో 50,000 మందికి దర్శనభాగ్యం కలుగుతుంది. తిరుమలలో రద్దీ గరిష్ఠ స్థాయికి చేరినా ఇబ్బందుల్లేకుండా తిరుపతిలో ఆరు కేంద్రాల్లో భక్తుల విడిదికి ఏర్పాట్లుచేశాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




