
Home » Telangana » Hyderabad » Telangana CM Revanth Reddy Lays Foundation Stone for Arya Vysya Atma Gaurava Bhavan VK
ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవాళ్లని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలున్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవాళ్లని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదలు ఉన్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఉప్పల్ భగాయత్‌లో ఈరోజు (ఆదివారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దివంగత మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రోశయ్య ఎవరినైనా విమర్శిస్తారు కానీ దూషించరని తెలిపారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య విగ్రహం.. హైదరాబాద్‌లో ఉండాలని తాము నిర్ణయించామని వెల్లడించారు. తాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణిస్తానని రోశయ్య గుర్తించారని చెప్పారు. ఆర్థిక లావాదేవీల్లో సలహాల కోసం ఆర్యవైశ్యులనే అడుగుతారని తెలిపారు.
నేను ఎప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినే..
కష్టాలు, బాధలు ఉన్నా సమాజంలో గౌరవం కోసం జీవించేవాళ్లు ఆర్యవైశ్యులని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నేను ఎప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినే. గ్రామంలో ఎంత పేదవారైనా కనీసం తినడానికి అప్పు ఇచ్చే వాళ్లు ఆర్యవైశ్య సోదరులు. గ్రామంలో ఏ శుభకార్యం ఉన్నా మొదట గుర్తుకు వచ్చేది వీరే. ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులని.. అవి వ్యవసాయం, వ్యాపారం. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే ఇచ్చారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందంటే కారణం ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్యనే. ఆయనకు అవకాశం, గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. శాసనమండలిలో దూకుడుగా నేను మాట్లాడితే రోశయ్య నన్ను పిలిచి ఆవేశం తగ్గించుకుని.. అనుభవంతో ముందుకు వెళ్తే పైకి వస్తామని నన్ను ఆశీర్వదించారు. నన్ను ముందు గుర్తించింది రోశయ్యనే.. ఆయనను విమర్శించే వారు కాదని, తిట్టే వారు కాదని.. రోశయ్య చురకలు వేసేవారు. రాష్ట్రం విడిపోయినా ఆయన గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేశాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచస్థాయి నాయకుడిగా ఆర్యవైశ్య బిడ్డ మహాత్మా గాంధీ ఎదిగారు..
రోశయ్య విగ్రహం ఏర్పాటుపైన కొంతమంది విమర్శలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నాలుగు దశాబ్దాల క్రితమే నేను హైదరాబాద్‌కు వచ్చాను. మంచైనా, చెడైనా నాది ఇక హైదరాబాద్ అని రోశయ్య అన్నారు. ఆయన మాటలను గౌరవించి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. ఆర్యవైశ్యులను వివిధ ప్రాంతాల్లో పలురకాల పేర్లతో పిలుస్తారు. ప్రపంచ స్థాయి నాయకుడు ఒకే ఒక్కరూ మహాత్మా గాంధీ. ప్రపంచంలో ఏ దేశం పోయినా మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మా గాంధీ. ప్రపంచస్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణం. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలు ఇస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆర్యవైశ్యుల పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. పేదల ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడాలి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణం కోసం సహాయం అందిస్తుంది. నేను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తా. కలిసి ఉంటేనే మీకు బలం.. సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తే అందరూ గౌరవిస్తారు. ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాం. కొడంగల్‌లో ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య కులానికి చైర్మన్ పదవి ఇచ్చాం.. రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలి.. కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆర్యవైశ్యులకు ముందు చూపు, జాగ్రత్త వాళ్ల డీఎన్ఏలోనే ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.





