
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై భారత మాజీ ఆటగాడు దినేశ్‌ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో గొప్ప చరిత్ర కలిగిన పాక్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టెస్టు దేశాలతో పోటీపడే స్థితిలో లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో దినేశ్‌ కార్తిక్ ( Dinesh Karthik ) ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ (ENG vs PAK) టెస్ట్ సిరీస్‌కు వ్యాఖ్యానం చేసినప్పుడు ఈ పాక్‌ జట్టు చాలా సాధారణంగా అనిపించింది. మొదటి రెండు టెస్టుల్లో వారు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 90 ఓవర్లు కూడా ఆడలేదు. పిచ్‌లు చాలా కఠినంగా ఉన్నాయి. కానీ, రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 90 ఓవర్లు కూడా ఆడలేనంత క్లిష్టమైన పిచ్‌లు కావవి. పాకిస్థాన్‌ జట్టు టెస్ట్ క్రికెట్‌కు అపకారం చేస్తోందని నాజర్ హుస్సేన్ (ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్) అన్నాడు. నేను అతనితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చివరి టెస్టులో రజావుల్లా బాగా రాణించాడు. అతను ఆరంభం నుంచే జట్టులో ఎందుకు లేడు? అసలు ఎంపిక ప్రక్రియలో ఏం జరుగుతోంది? ఎలాంటి ఆటగాళ్లను తీసుకుంటున్నారు? కెప్టెన్సీ మార్పులు, కోచ్‌ల మార్పులు అన్నీ అస్థిరంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం వారి ఆటతీరులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వారు( Pakistan ) ఆశించిన స్థాయిలో ఆడలేదు. కనీసం గట్టి పోటీనిచ్చేలా కూడా అనిపించలేదు. నిజాయితీగా చెప్పాలంటే, ప్రస్తుత పరిస్థితుల్లో వారు చాలా టెస్ట్ ఆడే దేశాలతో పోటీ పడగలరని నాకు అనిపించడం లేదు. ఇది నిజంగా బాధాకరం. టెస్ట్ క్రికెట్‌లో పాక్‌కు గొప్ప చరిత్ర ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఆ స్థాయికి ఏమాత్రం దగ్గరగా లేరు. పాక్‌ క్రికెట్‌లో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. సరైన వ్యక్తులు దీనిని గమనించి తిరిగి గాడిలో పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమైన పనిలా అనిపించడం లేదు’’ అని దినేశ్‌ కార్తీక్ వివరించాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






