
సింహాద్రి అప్పన్నస్వామి ఆలయానికి వెళ్లామంటే అక్కడ అన్నదానం చేయకుండా బయటకు రాకూడదు అంటారు. అప్పన్నస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు.. అక్కడికి వచ్చిన వారందరికీ కాదనకుండా అన్నదానం చేస్తుంటారు. నిత్య అన్నప్రసాద పథకం కింద భక్తులకు ఆహారం అందిస్తున్న ఈ అన్నప్రసాద పథకం ఆగస్టు 14తో 37 ఏళ్లు పూర్తి చేసుకుని 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.ఒకప్పుడు సింహగిరిని అన్నగిరిగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. సింహగిరికి వచ్చి ఏ ఒక్కరూ ఆకలితో తిరిగి వెళ్లేవారు కాదని, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారని చెబుతుంటారు. 1989 ఆగస్టు 14న సింహాచలం దేవస్థానం రూ. 50 వేల విరాళాలు సేకరించి, ఆ సొమ్ముతో భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వితరణ కేంద్రంలోనే భక్తులకు అన్నదానం చేస్తున్నారు.READ ALSO బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆల్‌టైం రికార్డు.. ఆరు లక్షల ఆషాఢం సారెలు!చాలా మంది భక్తులు కూడా లక్షలాది రూపాయలు అన్న సంతర్పణకు విరాళాలుగా ఇస్తున్నారు. రూ. లక్ష పైబడి విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం ఒక సర్టిఫికెట్ ఇచ్చి, ఫొటో గుర్తింపు కార్డు కూడా జారీ చేస్తుంది. కుటుంబ సమేతంగా దర్శనం కల్పించి శేషమాలతో సత్కరిస్తారు. 400 గ్రాముల కల్యాణం లడ్డూ ఒకటి, 80 గ్రాముల లడ్డూలు నాలుగు, ఆరు పులిహోర పొట్లాలు ప్రసాదంగా అందిస్తారు. ఏడాదికి ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు. దాత కోరిన తేదీనే వారి గోత్రనామాలతో భక్తులకు అన్నదానం చేస్తారు.రూ. 5 లక్షలకు పైబడి విరాళమిచ్చిన వారికి ప్రత్యేకంగా చందనోత్సవం రోజున రెండు రూ. వెయ్యి టికెట్లు అందిస్తారు. రూ. 10 వేల నుంచి రూ. లక్షలోపు దాతలకు ఏడాదిలో ఒకరోజు వారు కోరిన తేదీన దాత పేరిట అన్నప్రసాదం వితరణ చేస్తారు. సాధారణ రోజుల్లో మూడు వేల మంది, శనివారం 5500 మంది, ఆదివారం 4500 మందికి అన్నప్రసాదం అందిస్తారు. ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు 200 మంది కదంబం ప్రసాదం వితరణ చేస్తారు. ప్రస్తుతం అన్నప్రసాదం విభాగం డిపాజిట్లు రూ. 43.21 కోట్లు ఉంది.





