
Manoj Jarange : మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన ఉద్యమకారుడు మనోజ్ జరాంగే తన దీక్ష విరమించాడు. 20 రోజులుగా సాగించిన దీక్షను సెప్టెంబర్ 17, గురువారం విరమించాడు. మరాఠా రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించాడు. ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమాన్ని ముంబై నగరానికి తీసుకొస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మహారాష్ట్రలో మరాఠీలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో మనోజ్ జరాంగే కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నాడు. ఇటీవల తన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగాడు. అలాగే, హైదరాబాద్ గెజిట్, సతారా గెజిట్, ఔంద్ గెజిట్ సహా పలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం కున్బి వంశస్థులను ఓబీసీలుగా గుర్తించాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని ఆయన కోరుతున్నారు. అయితే, తన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఆయన నిరాహార దీక్ష విరమించారని ఆయన సన్నిహితులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు రాధాకృష్ణ విక్కే పాటిల్, దాదా భూసె, ఎమ్మెల్సీ ప్రసాద్ లాద్, ఎమ్మెల్యే సురేష్ దాస్, ఇతర సీనియర్ అధికారులతో తాను చర్చలు జరిపినట్లు, అనంతరమే దీక్ష విరమించినట్లు స్వయంగా మనోజ్ ప్రకటించారు. బీడ్ జిల్లాలోని పటోడాలో వారితో ఆయన చర్చలు జరిపారు. జల్నా జిల్లాలోని తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామంలోనే మనోజ్ దీక్ష కొనసాగించారు. ఇంతకుముందు ఆయన సెప్టెంబర్ 19 నుంచి ముంబైలో దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే, దీక్ష చేసే సమయంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుంటే.. ఈ సమయంలో మనోజ్ ముంబైలో దీక్ష చేయాలనుకోవడం సరైంది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మనోజ్ దీక్ష విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించారు.



