
లైనింగ్‌ పేరుతో నిధులు దోచే యత్నం గడివేముల మండలం కె.బొల్లవరం సమీపంలో ఎస్సార్బీసీ కాల్వ నంద్యాల పట్టణం, పాణ్యం, న్యూస్‌టుడే : శ్రీశైలం కుడిగట్టు కాల్వ కొండల నడుమ వెళ్తోంది.. సిమెంట్‌తో కూడిన రక్షణ గోడ పటిష్ఠంగా ఉంది.. తెగిపోయే అవకాశాలు చాలా తక్కువ.. అయినా అధికారులు లైనింగ్‌ పనులు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారు. పనుల అనుమతులు సాధించేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాతి గోడల నడుమ మొక్కుబడిగా పనులు చేసి నిధులు కొల్లగొట్టేందుకు అధికారులు, గుత్తేదారులు ఒక్కటై పన్నాగం పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ) లైనింగ్‌ పనులు చేపట్టేందుకు 2021లో రూ.1,510 కోట్లు కేటాయించారు. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు ఒక ప్యాకేజీగా.. అక్కడి నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌ వరకు మరో ప్యాకేజీగా పనులు విభజించారు. ఒప్పందం మేరకు పనులు రెండేళ్ల కిందటే పూర్తి కావాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాకపోవడంతో ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులివ్వడంతో బనకచర్ల వరకు లైనింగ్‌ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. దీంతో బనకచర్ల- గోరుకల్లు మధ్య పనులు 25, 26 ప్యాకేజీలుగా విడగొట్టి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 25, 26 ప్యాకేజీ పనులను కొందరు ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. రైతుల అభిప్రాయాలను ప్రస్తావిస్తూ ఓ ప్రజాప్రతినిధి లేఖ ఇచ్చారు. మరో ప్రజాప్రతినిధి పనులకు అనుకూలంగా లేఖ ఇవ్వగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే సరిదిద్దుకొన్నారు. పనులు ఆపేయాలంటూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కోరారు. మరో నేతను రైతులు కలిసి లైనింగ్‌ పనులు ఆపేయాలని విన్నవించారు. దీంతో జిల్లా ప్రజాప్రతినిధులు అమరావతికి వెళ్లి జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సమస్యను విన్నవించాలని నిర్ణయించుకున్నారు. బనకచర్ల- గోరుకల్లు మధ్య 56 కి.మీ. మేర కాల్వ ప్రవహిస్తోంది. పాములపాడు, జూపాడుబంగ్లా, గడివేముల, పాణ్యం మండలాల మీదుగా వెళ్తోంది. కాల్వ బెడ్‌ వెడల్పు 42 మీటర్లు.. 80 అడుగుల లోతులో ఉంది. 15 కి.మీ. పొడవునా ఎర్రమల కొండల మధ్య కాల్వ విస్తరించి ఉంది. ఈ ప్రాంతమంతా కొండ రాయితో నిండి ఉంది. మరోవైపు కాల్వకు సుమారు 15 కి.మీ. పొడవునా సిమెంట్‌తో నిర్మించిన రక్షణ గోడ ఉంది. పూర్తిగా రాతి కొండల మధ్య కాల్వ ఉండడంతో తెగిపోయే అవకాశాలూ లేవు. ఇక్కడ లైనింగ్‌ అవసరం లేదు.. నిధులు వృథా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్యాకేజీ పనుల గడువును 2028, డిసెంబరు 31 వరకు పొడిగించాలని ఎస్సార్బీసీ అధికారులు ఇటీవల సీఈకు నివేదించారు. అక్కడినుంచి సానుకూలంగా నిర్ణయం వచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన పనులను చేయాలన్న ఉత్సాహం అధికారుల్లో కనిపిస్తుండడం గమనార్హం. అధికారులకు మద్దతుగా ఓ గుత్తేదారు సంస్థ తమ పలుకుబడి ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఒక సంస్థ తమకు అనుకూలమైన అధికారులను ఆయా సీట్లలో కూర్చోబెట్టింది. కాల్వలో నీళ్లు తగ్గిన వెంటనే ఈ ఏడాది డిసెంబరు నుంచి పనులు ప్రారంభించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్సార్బీసీకి సిమెంట్‌ లైనింగ్‌ చేస్తే తీవ్రంగా నష్టపోతాం. కాల్వకు నీటి విడుదల లేకున్నా రెండు నెలలపాటు ఊటలు ఉంటున్నాయి. వేసవిలో ఒక వర్షం వచ్చినా నీటి ఊటలు తిరిగి వస్తున్నాయి. ప్రస్తుతం నీటి సమస్య అంటూ ఏమీ లేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




