
దామాషా ప్రకారం లోక్‌సభ స్థానాలను పెంచాలి అప్పుడు డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదు జిందాల్‌ వర్సిటీ కార్యక్రమంలో కేటీఆర్‌ ‘ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ’ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేటీఆర్‌ ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో తమ పార్టీకి పొత్తు ఉండదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% ప్రాతినిధ్యం ఉందని.. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో భారాసకు ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన తెలిపారు. హరియాణా సోనిపట్‌లోని ‘ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ’లో బుధవారం ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్టార్టప్‌ స్టేట్‌’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రత్యేక ప్రసంగం చేశారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై సమాధానాలిచ్చారు. ‘‘ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఇలాగే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగాలి’’ అని కేటీఆర్‌ సూచించారు. తన ప్రసంగంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని... సాగు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో భారాస హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్‌ వివరించారు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ... కరవు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్‌ పరిష్కారం ఈ ప్రాజెక్టు అని ఆయన అభివర్ణించారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్‌ వంటి సంస్థల పాత్రను వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సి.రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





