
ఫీల్డ్ వర్క్ ఎక్కువ. కాబట్టే, సివిల్ ఇంజినీరింగ్ని ఎంచుకోవడానికి చాలామంది అమ్మాయిలు ఆలోచిస్తారు. కానీ ఒంగోలుకి చెందిన కొప్పోలు గీతాంజలి వేరు. దానిపై ఆసక్తి పెంచుకున్నారు, రాణిస్తున్నారు. అంతేకాదు, తాజాగా ‘అవుట్ స్టాండింగ్ ఉమన్ ఇంజినీర్’ అవార్డునీ అందుకున్నారు. ఫీల్డ్‌ వర్క్‌ ఎక్కువ. కాబట్టే, సివిల్‌ ఇంజినీరింగ్‌ని ఎంచుకోవడానికి చాలామంది అమ్మాయిలు ఆలోచిస్తారు. కానీ ఒంగోలుకి చెందిన కొప్పోలు గీతాంజలి వేరు. దానిపై ఆసక్తి పెంచుకున్నారు, రాణిస్తున్నారు. అంతేకాదు, తాజాగా ‘అవుట్‌ స్టాండింగ్‌ ఉమన్‌ ఇంజినీర్‌’ అవార్డునీ అందుకున్నారు. ‘వసుంధర’తో తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా... మా స్వస్థలం సంతనూతలపాడు. కానీ పుట్టి పెరిగిందంతా ఒంగోలు. నాన్న వెంకటేశ్వర్లు పోస్టల్‌ విభాగంలో పనిచేసేవారు. అమ్మ నాగవేణి... తను ఉద్యోగం చేయలేకపోయానని మా ముగ్గురు అక్కాచెల్లెళ్లనీ ప్రోత్సహించారు. కాబట్టే, మేమంతా ఉన్నతవిద్య అభ్యసించగలిగాం. నేను జేఎన్‌టీయూ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశా. ఈ కోర్సుకి తప్పక ఫీల్డ్‌లోకి వెళ్లాలి. రెండో ఏడాది నుంచే మెటీరియల్, సర్వేలకోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లడం, ల్యాబ్‌ల్లో పనిచేయడం వంటివెన్నో చేశా. మూడో ఏడాదిలో జియోటెక్‌ పరిచయమైంది. దీనిలో ఏదైనా కట్టడానికి అక్కడి మట్టి అనుకూలతను పరిశీలిస్తాం. ఈ క్రమంలో మట్టితో అనుబంధం ఏర్పడింది. అది నన్ను మాస్టర్స్‌ వైపు నడిపింది. నిజానికి ఇంజినీరింగ్‌ అవ్వగానే నాకు రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్, ఇరిగేషన్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు ఉద్యోగమా, ఎంటెక్‌నా అన్న పరిస్థితి. ఓ 15 రోజులు ఉద్యోగం చేసి, నాకు ఆసక్తి ఉన్న చదువు వైపునకే వెళ్లా. వరంగల్‌ ఎన్‌ఐటీలో జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశా. దీనిలో భాగంగా సవాళ్లతో కూడిన నల్లరేగడి నేలల్లో ఏడాదిపాటు ప్రాజెక్టునీ చేశా. నా నిర్ణయం ఇప్పటికీ నాకు గర్వంగానే ఉంటుంది. ఏ కట్టడమైనా పునాది బలంగా ఉంటేనే నిలబడుతుంది. దాన్ని మేం డిజైన్‌ చేస్తాం మరి. పర్వత, కొండచరియలున్న ప్రాంతాలను పరిశీలించి, కట్టడాలకు అనువుగా ఉన్నాయా గమనించడం, లేకపోతే ఏవి సురక్షితమన్న అంశాలపై పనిచేస్తుంటాం. ప్రస్తుతం నేను ‘ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌’ అనే ప్రభుత్వ అనుబంధ సంస్థలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా. ఇది మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ పెట్రోలియం విభాగం కిందకి వస్తుంది. 50కిపైగా ప్రాజెక్టులపై పనిచేశా. అన్నీ క్షేత్రస్థాయికి వెళ్లి చేయాల్సినవే. రోగి సమస్యను డాక్టర్లు భిన్న పరీక్షలు చేసి కనుక్కుంటారు. ఆపై తగిన మందులిస్తారు. మేమూ డాక్టర్లలాగే! మేమూ మట్టి విషయంలో అలాగే చేస్తాం. ఇందులో ఎన్నో సవాళ్లుంటాయి. సస్టెయినబిలిటీ, పెట్టుబడి ఇలా ఎన్నో అంశాల్ని పరిశీలించుకుంటూ పరిష్కారాలు చూపాలి. మా సంస్థ చాలావరకూ రిఫైనరీలతో కలిసి పనిచేస్తుంది. దీంతో భిన్న విభాగాలపైనా పట్టు తెచ్చుకున్నా. లీడ్‌ ఆడిటర్‌ కోర్సు చేశా. కొన్నిసార్లు నేలమీదే కాదు... సముద్రాల్లోనూ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుంటారు. వాటి ఫౌండేషన్‌ ఎలా డిజైన్‌ చేయాలన్న దాన్నీ నేర్చుకున్నా. ఇలాంటి సమయాల్లో నన్ను నేను రక్షించుకోవడానికి అవసరమైన సర్టిఫైడ్‌ కోర్సునీ పూర్తిచేశా. యూఎస్, ఇథియోపియా, కువైట్‌లకు సాయిల్‌ ఇన్వెస్టిగేషన్‌ పనులకి మా సంస్థ నన్ను పంపింది. ఇలాంటప్పుడు ‘మహిళను ఎలా పంపుతార’ని అడిగిన సందర్భాలున్నాయి. దానికి మా హెడ్‌ ‘తనకి అన్నీ తెలుసు. సమస్యేంటో తనైతేనే కచ్చితంగా గుర్తించగలద’ని చెప్పారు. అది నాకు దక్కిన గుర్తింపే! ఏపీలో ఎన్నో రిఫైనరీ, గ్యాస్‌ టర్మినల్స్‌ ఫౌండేషన్‌ పనులు చూసుకున్నా. మరెన్నో చేస్తున్నాం. ఎంచుకున్న రంగంలో నన్ను నేను మెరుగుపరచుకుంటూ రాణిస్తున్నా. కాబట్టే, తాజాగా సివిల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ రివ్యూ (సీఈ అండ్‌ సీఆర్‌) నుంచి అవుట్‌ స్టాండింగ్‌ ఉమన్‌ ఇంజినీర్‌ పురస్కారాన్ని అందుకున్నా. కన్‌స్ట్రక్షన్, సస్టెయినబుల్, గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాక్టీసెస్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, బృందాల్ని నడిపించడం ఇలా వివిధ అంశాల్లో తమదైన ముద్ర వేస్తున్నవారికి ఈ పురస్కారాల్ని అందిస్తారు. మొత్తంగా 138 మంది పోటీపడగా 32మందికి పురస్కారాలు అందించారు. నేను కన్‌స్ట్రక్షన్‌ విభాగంలో అందుకున్నా. నాది కొంచెం కష్టమైన రంగమే! మావారు మురళీకృష్ణదీ సివిల్‌ ఇంజినీరింగ్‌ నేపథ్యమే. దీంతో ‘నువ్వు ఏది చేయాలనుకున్నా చెయ్య’మంటూ నన్ను ప్రోత్సహించేవారు. బాబు ఓజస్తేజ కూడా నా పని అర్థం చేసుకుంటాడు. కాబట్టే, సమర్థంగా పనిచేయగలుగుతున్నా. బృందాన్నీ నడిపించగలుగుతున్నా. నేనేకాదు, నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే ఎవరైనా రాణిస్తారు. పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు. అయితే క్రమశిక్షణతో శ్రమించాలి, ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు అద్భుతాలు సృష్టించొచ్చు. వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు . .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





