
తనను అంబానీ వారి కోడలిగా, మర్చంట్ ఫ్యామిలీ ఆడపడుచుగా కంటే.. ఓ భరతనాట్య కళాకారిణిగా గుర్తించినప్పుడే అమితానందం కలుగుతుందంటోంది రాధికా మర్చంట్. నాట్యమంటే ఆమెకు అంత ఇష్టం మరి! తనను అంబానీ వారి కోడలిగా, మర్చంట్ ఫ్యామిలీ ఆడపడుచుగా కంటే.. ఓ భరతనాట్య కళాకారిణిగా గుర్తించినప్పుడే అమితానందం కలుగుతుందంటోంది రాధికా మర్చంట్‌. నాట్యమంటే ఆమెకు అంత ఇష్టం మరి! సరిగ్గా నాలుగేళ్ల క్రితం శాస్త్రీయ నృత్యంలో అరంగేట్రం చేసిన రాధిక.. అప్పుడు తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా భరతనాట్యం చేసి.. నృత్యంపై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకుంది. ‘అత్తకు తగ్గ కోడల’నిపించుకుంది. పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అంబానీ వారింట ఆ సందడి రెట్టింపవుతుంటుంది. ఇందుకు సెలబ్రిటీలంతా ఈ వేడుకల్లో పాల్గొనడం ఓ కారణమైతే.. నీతా అంబానీ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ మరో కారణమని చెప్పచ్చు. అయితే ఈసారి ఆ బాధ్యతను ఇంటి కోడలిగా రాధిక తీసుకుంది. గణపతి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా ‘ఏకదంతాయ వక్రతుండాయ’ అనే పాటకు భరతనాట్యం చేసింది. తన అద్భుత నృత్యంతో గణపతికి నీరాజనాలు అందించడంతో పాటు అతిథుల్నీ ఆకట్టుకుందీ అంబానీ చిన్న కోడలు. అందుకే రాధిక భరతనాట్యం వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘అత్తకు తగ్గ కోడలు’ అంటూ రాధికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తన నృత్య ప్రదర్శనే కాదు.. ఇందుకోసం ఆమె ఎంచుకున్న కాంజీవరం చీర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన పింక్‌ కలర్‌ పట్టుచీరలో, భారీ నగలతో ముస్తాబై సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది రాధిక. రాధికకు చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యమంటే ప్రాణం. ఈ మక్కువతోనే నాలుగేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిందట. ముంబయిలోని ‘శ్రీ నిభా ఆర్ట్స్‌’ అకాడమీలో గురు భావనా థాకర్‌ పర్యవేక్షణలో దాదాపు ఎనిమిదేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆమె.. ‘ఓపిక, పట్టుదల ఉంటేనే ఈ నృత్యంలో పట్టు సాధించగలం’ అంటూ తన ప్రదర్శనలతో చెప్పకనే చెబుతుంటుంది. 2022లో ‘జియో వరల్డ్‌ సెంటర్‌’లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో తొలి నృత్య ప్రదర్శన చేసిన రాధిక.. తన అభినయంతో నాట్య ప్రియుల్ని ఆకట్టుకుంది. అయితే ఆపై తన పెళ్లి, ఇతర బాధ్యతల కారణంగా డ్యాన్స్‌కు కొంత విరామమిచ్చిన ఆమె.. తాజాగా అద్భుత ప్రదర్శన ఇచ్చి మరోసారి అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ‘మా అమ్మకు భరతనాట్యమంటే చాలా ఇష్టం. అదే తన అసలైన గుర్తింపు అని ఎప్పుడూ చెబుతుంటుంది..’ అంటూ ఈషా అంబానీ ఓ సందర్భంలో తన తల్లి నీతాకు నృత్యమంటే ఎంతిష్టమో చెప్పుకొచ్చింది. ఇలా తన అత్తగారిలాగే నాట్యమే తన గుర్తింపు అంటోంది రాధిక. ప్రతిరోజూ నృత్య సాధన చేస్తానంటోన్న ఆమె.. ఇది తనకు ధ్యానంతో సమానమని చెబుతోంది. అయితే వివిధ కారణాల వల్ల డ్యాన్స్‌కు విరామమిచ్చినా.. మళ్లీ తనకు స్టేజ్‌ ఎక్కి ప్రదర్శన ఇవ్వాలని ఉందంటూ ఓ సందర్భంలో రాధిక తనతో పంచుకున్నట్లు చెబుతున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ వైభవీ మర్చంట్‌. తాజాగా రాధిక చేసిన నృత్యానికి కొరియోగ్రఫీ చేసిన ఆమె.. ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘ఓ సందర్భంలో ‘మళ్లీ వేదికపై నృత్య ప్రదర్శన చేయాలని ఉంది’ అని నువ్వు చెప్పావు. ఇందుకు గణేష్‌ చతుర్థికి మించిన మంచి సందర్భం మరొకటి లేదనిపించింది. భరతనాట్యం పట్ల నీకున్న తపన, మక్కువ, క్రమశిక్షణ.. అన్నీ ఈ ప్రదర్శనతో మరోసారి బయటపెట్టావ్‌.. గాడ్‌ బ్లెస్‌ యూ మై డార్లింగ్‌..’ అంటూ రాధికను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇలా నాట్యమే కాదు.. సంగీతం, సాహిత్యం అన్నా తనకు చాలా ఇష్టమంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది రాధిక. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings