
చిన్న కష్టానికే కుంగిపోయే వారు చాలామంది ఉంటారు. కానీ ‘కష్టాలు మనల్ని దృఢంగా మార్చడానికే వస్తాయేమో!’ అంటోంది కావ్యా శర్మ. తన జీవితంలో అంతటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందామె. చిన్న వయసులోనే ఓ ప్రమాదంలో తన ఎడమ కాలిని, కన్నతల్లిని కోల్పోయిన ఆమె.. ఎంతో మానసిక వేదన అనుభవించింది. చిన్న కష్టానికే కుంగిపోయే వారు చాలామంది ఉంటారు. కానీ ‘కష్టాలు మనల్ని దృఢంగా మార్చడానికే వస్తాయేమో!’ అంటోంది కావ్యా శర్మ. తన జీవితంలో అంతటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందామె. చిన్న వయసులోనే ఓ ప్రమాదంలో తన ఎడమ కాలిని, కన్నతల్లిని కోల్పోయిన ఆమె.. ఎంతో మానసిక వేదన అనుభవించింది. అయినా ఒకానొక దశలో ఈ పరిస్థితి నుంచి బయటపడి తన జీవితానికంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ఈ పట్టుదలతోనే ఇప్పుడు ఓవైపు టీచర్‌గా, మరోవైపు ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం కృత్రిమ కాలితోనే కఠినమైన వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోల్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంటోంది. తనను చూసి తన లాంటి శారీరక లోపాలున్న వారిలో ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలంటోన్న కావ్య కథ మీరూ చదివేయండి. బాల్యం ఎవరికైనా ఓ అందమైన జ్ఞాపకం. కానీ నాకు మాత్రం ఓ పీడకల. నాకు ఆరేళ్ల వయసున్నప్పుడే మా అమ్మానాన్నలు విడిపోయారు. దాంతో మా అమ్మ నన్ను, నా తోబుట్టువుల్ని తీసుకొని బయటికొచ్చేసింది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్లే మమ్మల్ని ఆదరించారు. బరువుగా కాకుండా ఓ బాధ్యతగా చూసుకున్నారు. అయితే నాకు 12 ఏళ్లున్నప్పుడు నేను, మా అమ్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యాం. అమ్మ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. నా ఎడమ కాలు బాగా దెబ్బతింది. ఏడాది పాటు ఆస్పత్రిలోనే ఉన్నా. కాలికి దాదాపు 15 ఆపరేషన్లయ్యాయి. అయినా ఫలితం లేకపోయింది. ‘బతకాలంటే కాలు తీసేయాల్సిందే’ అన్నారు వైద్యులు. కానీ కాలు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోయా. ఆఖరికి చేసేది లేక ఎడమ మోకాలు పైవరకు తొలగించుకోవాల్సి వచ్చింది. ఇలా ఒంటి కాలితోనే ఇంటికి వెడితే.. అమ్మ లేని లోటు నన్ను శూన్యంలోకి నెట్టేసింది. దాంతో మరింతగా కుంగిపోయా. కొన్నాళ్లు గడిచాక ఈ బాధను దిగమింగుకుని తిరిగి చదువుపై దృష్టి పెట్టా. వాకర్‌ సహాయంతో నడిచేదాన్ని.. స్కూలుకెళ్లేదాన్ని. పిల్లలందరూ ఆడుకుంటుంటే చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేదాన్ని. ఇన్ని ప్రతికూలతల మధ్యే స్కూలింగ్‌ పూర్తిచేశా. అయితే ఒక రోజు చెకప్‌ కోసమని ఆస్పత్రికి వెళ్తే.. ఒంటి కాలితో నేను పడుతున్న ఇబ్బందుల్ని డాక్టర్‌ గుర్తించారు. ‘కృత్రిమ కాలిని అమర్చుకో.. ఇకపై ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు..’ అన్నారు. ఇలా డాక్టర్‌ సలహా మేరకు కస్టమైజ్‌డ్‌ ప్రోస్థటిక్‌ కాలిని అమర్చుకున్నా. దాంతో నా జీవితమే మారిపోయింది. కృత్రిమ కాలు అమర్చుకున్నాక ఏదో తెలియని ఆత్మవిశ్వాసం నన్ను ఆవరించింది. శారీరక లోపం ఉన్నా నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న కసి నాలో పెరిగింది. ఈ క్రమంలోనే ప్రోస్థటిక్‌ కాలితో నడవడం, ఒంటరి ప్రయాణాలు చేయడం, కాలేజీకి వెళ్లడం, అన్ని పనులు చేసుకోవడం.. ఇలా స్వతంత్రంగా బతకడం అలవాటు చేసుకున్నా. ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకుండా ట్యూషన్లు చెబుతూ.. వచ్చిన డబ్బుతో చదువుకునేదాన్ని. అంతేకాదు.. శారీరకంగానూ దృఢంగా, ఫిట్‌గా మారాలనుకున్నా. అందుకే జిమ్‌లో చేరాను. అక్కడ నిపుణులు చెప్పే వర్కవుట్లు నేర్చుకుంటూనే.. ఇంటికొచ్చాకా వాటిని సాధన చేసేదాన్ని. అలా స్ట్రెంత్‌ ట్రైనింగ్‌, యోగా, ధ్యానం.. నేర్చుకున్నా. ఇప్పుడు ఏ వ్యాయామం అయినా చేసేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది. ఇదే పాజిటివిటీని నాలాంటి శారీరక లోపాలున్న వారిలోనూ నింపాలనుకున్నా. ఈ ఆలోచనతోనే నేను చేసే వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నా. అలాగే పలు మారథాన్లలోనూ పాల్గొంటున్నా. ఇటీవలే ఓ మారథాన్‌లో నగదు బహుమతి కూడా వచ్చింది. మరోవైపు ఫ్యాషన్‌ షోలలోనూ ర్యాంప్‌ వాక్‌ చేస్తుంటా. ‘శారీరక లోపాలు శరీరానికే కానీ మనం పెట్టుకున్న ఆశయాలకు కాదు..’ అని నిరూపించడమే నా లక్ష్యం. నన్ను చూసి నాలాంటి వాళ్లలో ఒక్కరు స్ఫూర్తి పొందినా నాకు ఆనందమే! అన్నట్లు.. ప్రస్తుతం ఓ స్కూల్లో టీచర్‌గానూ పనిచేస్తున్నా. నా జీవితాన్నే ఉదహరిస్తూ ఆయా వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలూ చేస్తుంటా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings