
వివరాలు వెల్లడిస్తున్న సీపీ సుమతి. వెనక నిందితులు ఈనాడు, హైదరాబాద్‌: రౌడీషీటర్‌ నయీమ్‌ హత్య కేసును ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, మల్కాజిగిరి పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నాడని, గతంలో జైలులో ఉన్నప్పుడు వేధించాడని కక్ష పెంచుకున్న స్నేహితులు హతమార్చినట్లు తేల్చారు. ఖమ్మంలో హత్యకు కుట్రపన్నిన నిందితులు.. నయీమ్‌అనుచరుల ద్వారా అతణ్ని ట్రాప్‌ చేయించి మట్టుబెట్టినట్లు గుర్తించారు. మొత్తం 12 మంది హత్య పథకంలో పాల్గొనగా 8 మందిని అరెస్టు చేశారు. నలుగురు పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవలి, కడాయి, కారు, 2 బైక్‌లు, సుత్తి, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీలు అనురాధ, మనోహర్, అదనపు డీసీపీ షాకిర్‌హుస్సేన్, ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ప్రతాప్‌రెడ్డి, మఖ్బూల్‌ జానీతో కలిసి మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి ఎల్బీనగర్‌లో బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. దూషించాడని కక్ష: ఇల్లెందుకు చెందిన నయీమ్‌(31)పై ఇల్లెందు ఠాణాలో 8, హయత్‌నగర్, ఉప్పల్, వనస్థలిపురం ఠాణాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. నాగోలు బండ్లగూడలో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇల్లెందుకు చెందిన ఓట్ల దినకర్‌(35), ప్రస్తుతం ఎల్బీనగర్‌లో ఉండే రియల్టర్‌ కనకం ఉమామహేశ్‌(32), నయీమ్‌.. ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఇల్లెందులో ఉన్నప్పుడు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన సమయంలో ఉమామహేశ్‌కు యానాంకు చెందిన జిమ్‌ ట్రైనర్‌ సయ్యద్‌ రబ్బానీ(21)తో పరిచయం ఏర్పడింది. నయీమ్‌ బాడీబిల్డర్‌ కావడంతో రబ్బానీ తను కూడా బాడీబిల్డర్‌ కావాలనే ఆశతో నయీమ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. తర్వాత నయీమ్, ఉమామహేశ్, రబ్బానీ ముగ్గురూ హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు ప్రారంభించారు. ఉప్పల్, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ఠాణాల పరిధిలో గత 2 నెలల్లో 3 కేసులు నమోదయ్యాయి. నయీమ్‌ సూచనతో రబ్బానీ బండ్లగూడలోని అతడింట్లో సహాయకుడిగా ఉండేవాడు. నయీమ్‌ రోజూ మద్యం తాతి రబ్బానీని, అతడి కుటుంబ సభ్యుల్ని దూషించేవాడు. రబ్బానీ మకాం మార్చినా వేధింపులు ఆగలేదు. ఉమామహేశ్, ఓట్ల దినకర్‌కూ కాల్‌ చేసి వేధించేవాడు. అవమానించడంతో కక్ష పెంచుకున్న రబ్బానీ, ఉమామహేశ్, దినకర్‌ ముగ్గురూ కలిసి నయీమ్‌ను మట్టుపెట్టాలని పథకం వేశారు. అతడి అనుచరులైన పూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ జబీ, నాగోలులో ఉంటున్న కొత్తగూడెం వాసి భోళే, కార్తీక్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేవారు. అంతా కలిసి అంతమొందించి: హత్యకు పథకం వేసిన రబ్బానీ గతంలో జైలులో పరిచయమైన ఛత్రినాకకు చెందిన రసుమల్ల సాకేత్‌(26)ను సంప్రదించాడు. 2024-25లో జైలులో ఉన్నప్పుడు సాకేత్‌ను నయీమ్‌ వేధించాడు. ఆ కక్షతో రబ్బానీకి సహకరించేందుకు అంగీకరించాడు. సాకేత్‌ తన స్నేహితుడు చాంద్రాయణగుట్టకు చెందిన వల్లిపోల మహేశ్‌(23), మాణికేశ్వరినగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఆలకుంట్ల వెంకట్‌(22), ఉప్పుగూడకు చెందిన కొడిగంటి రాఘవేందర్‌(27), ఛత్రినాకకు చెందిన క్యాటరింగ్‌ పనిచేసే వల్లపుదాసు చరణ్‌గౌడ్‌(18), ఖమ్మంకు చెందిన సోలార్‌ ప్యానెళ్ల వ్యాపారి మహ్మద్‌ బద్రుల్లా హుస్సేన్‌ (44)కు చెప్పాడు. హత్య పథకం పన్నేందుకు 13న రబ్బానీ, మహేశ్, రాఘవేందర్, వెంకట్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఖమ్మంవెళ్లారు. అక్కడే దినకర్, బద్రుల్లా, ఉమామహేశ్‌ను కలిసి ఎలా అమలుచేయాలో చర్చించారు. 14న దినకర్‌ ప్రభుత్వ వాహనమని పేరున్న కారు సిద్ధంచేశాడు. అందులోనే దినకర్, రబ్బానీ, వెంకట్, రాఘవేందర్, ఉమామహేశ్‌ నాగోలు చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగాఉన్న సాకేత్, చరణ్‌గౌడ్, ఇస్మాయిల్‌జబీ, వారితో కలిసి సుప్రీం వైన్స్‌ దగ్గరికి వెళ్లారు. భోళే, కార్తీక్‌ మద్యం తాగుదామంటూ నయీమ్‌ను సుప్రీంవైన్స్‌కు తీసుకొచ్చారు. నిందితులు లోపలికి వెళ్లగానే నయీమ్‌ను తరుముతూ కళ్లల్లో కారం చల్లి వేట కొడవలితో దాడి చేశారు. కడాయి విచక్షణా రహితంగా కొట్టడంతో నయీమ్‌ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం నిందితులు ప్రైవేటు ట్రావెల్స్‌లో ఖమ్మంపారిపోయారు. రబ్బానీ, దినకర్, మహేశ్, సాకేత్, వెంకట్, రాఘవేందర్, చరణ్‌గౌడ్, బద్రుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్, ఇస్మాయిల్‌జబీ, భోళే, కార్తీక్‌ పరారీలో ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




