
ఒక్క అడుగుతో ప్రారంభమై.. 70కు తగ్గకుండా.. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశ్‌ గణేశ్‌ నవరాత్రోత్సవాలకు భాగ్యనగరం పెట్టింది పేరు. అరడుగు ఎత్తు నుంచి అరవై అడుగుల భారీ గణనాథులు కొలువుతీరే నగరంలో.. పదకొండు రోజులపాటు పండగే. విభిన్న రూపాల్లో తయారైన ప్రతిమల కొనుగోళ్లు.. గల్లీగల్లీలో మండపాల ఏర్పాట్లు.. ఎటు చూసినా సందడే. ఒకటికి మించి మరొకటిలా.. ఏటా ప్రత్యేకత చాటుకునేలా మండపాల అలంకరణలో పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రముఖ మండపాలు.. ఆలయాలు.. గణనాథుల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఖైరతాబాద్, న్యూస్‌టుడే: వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ ఖైరతాబాద్‌ మహాగణపతి గుర్తుకొస్తాడు. ఎప్పటికప్పుడు నూతన అలంకారంతో మహావైభవంతో ఆకట్టుకుంటున్నాడు. ఖైరతాబాద్‌లో తొలిసారిగా 1954లో అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఒక్క అడుగు విగ్రహంతో స్థానిక గ్రంథాలయంలో ఉత్సవాలు మొదలుపెట్టారు. తొమ్మిదేళ్లపాటు ఏటా ఒక అడుగు పెంచుకుంటూ 9 వరకు ఆ గదిలోనే నిర్వహించారు. పది అడుగుల విగ్రహం గదిలో ఉంచడం వీలుకాక గ్రంథాలయం ముందు అరుగుపై ఏర్పాటుచేశారు. క్రమేణా ఎత్తు పెంచగా 2014లో 60 అడుగులకు చేరుకుంది. తర్వాత ఏటా ఒక్కో అడుగు తగ్గిస్తూ 40 అడుగుల వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. ఎత్తుతగ్గించే విషయంలో భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో వేడుకలు ప్రారంభించి 70 ఏళ్ల సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. నాటినుంచి 70అనే సంఖ్యను స్థిరంగా ఉంచి నిర్మాణ క్రమంలో ఒక అడుగు తగ్గించడం, ఒక అడుగు పెంచడం చేస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగులుగా నిర్ణయించినా 70 అడుగులకు చేరింది. కొవిడ్‌ సమయంలో మాత్రం 11 అడుగులే ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ స్థానికుల సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతమవుతున్నాయి.1954లో సింగరి శంకరయ్య ప్రారంభించగా ఆయన తదనంతరం సోదరుడు సుదర్శన్‌ బాధ్యతలు చేపట్టారు. సుదర్శన్‌ తర్వాత ఆయన కుమారుడు రాజ్‌కుమార్‌ బాధ్యతలుతీసుకున్నారు. ఆ కుటుంబానికి సహకారంగా సందీప్‌రాజ్‌ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.వేడుకలకు సింగరి కుటుంబం ఛైర్మన్‌గా కొనసాగుతున్నా స్థానికులందరూ భాగస్వాములవుతారు. సింగరి శంకరయ్య, ప్రస్తుత ఛైర్మన్‌ సింగరి రాజ్‌కుమార్‌, కన్వీనర్‌ సందీప్‌రాజ్‌ విగ్రహం తయారీకి పండితుడిని సంప్రదించి నిర్మాణం, నామకరణం చేస్తారు. తొలుత విగ్రహ నమూనా డిజిటల్‌లో చేసి పండితుడి అనుమతితో తుదినిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా నామకరణంచేశారు. విగ్రహం ఒక అడుగు ఎత్తు నుంచి పదడుగుల వరకు ఉన్నప్పుడు దూల్‌పేటలో కొనేవారు. ఎత్తు పెరగడంతో మండపంలోనే చేయిస్తున్నారు. మొదట్లో నగరానికి చెందిన శిల్పి రూపొందించగా 1978 నుంచి తమిళనాడుకు చెందిన చిన్నస్వామి రాజేంద్రన్‌ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో తొలి విగ్రహం 14 అడుగులతో ప్రారంభమైంది. ఏటా 11 రోజులు కొనసాగే ఉత్సవాలు ఈసారి 12రోజులు జరగనున్నాయి. సాధారణంగా అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు. ఆ ముహూర్తం ఈసారి 25న వచ్చింది. విగ్రహం తయారీ కోసం గతేడాది రూ.1.05 కోట్ల ఖర్చు అయిందని, ఈ ఏడాది పెరిగిన ధరలతో రూ.1.20 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ తెలిపింది. బ్యారికేడ్లను రోడ్లు భవనాల శాఖ, నిమజ్జనానికి క్రేన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ట్రాలీని దాతలు బహూకరిస్తున్నారు. రోజూ లక్ష మంది వరకు దర్శించుకుంటారు. సెలవురోజుల్లో ఈ సంఖ్య 3మూడు లక్షలకు చేరుతుంది. వీఐపీల దర్శనాలూ ఉంటాయి. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తుంటారు. పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీ, వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు సేవలు అందిస్తుంటారు. రాంనగర్, న్యూస్‌టుడే: గణేశ్‌ ఉత్సవాలంటే అందరికీ నిమజ్జన వేడుకే గుర్తుకొస్తుంది.. ఇప్పుడు ఆగమన్‌ వేడుకలు నయా ట్రెండ్‌గా మారాయి. ప్రతిమలను మండపాలకు తరలించే కార్యక్రమాన్ని ‘గణేశ్‌ ఆగమనం’ పేరుతో పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు కొద్దిమంది నిర్వాహకులు భక్తుల సమక్షంలో సాదాసీదాగా సాగిన ఆగమన కార్యక్రమాలు.. ప్రస్తుతం భారీ హంగులు, ప్రత్యేక సెట్టింగులు, డీజేలు, వాహనాలతో కనువిందు చేస్తున్నాయి. గణేశుడి ప్రతిమను తీసుకొచ్చే వాహనం ప్రధాన కూడలికి చేరుకోగానే బాణసంచా పేల్చుతూ గణనాథుడి ప్రతిమపై కప్పిన వస్త్రాన్ని తొలగించే సమయంలో భక్తుల హర్షధ్వానాలతో ప్రాంతం మార్మోగుతుంది. ఆగమన కార్యక్రమాలను చూసేందుకు పెద్దసంఖ్యలో యువత, భక్తులు తరలివస్తున్నారు. ఆగమన వేడుక ప్రధాన ఆకర్షణగా మారడంతో నిర్వాహకులు కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అతిపెద్ద మట్టి గణేశ్‌ నాగోలులో రూపొందుతున్న మట్టి గణపతి రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం నాగోలులో రూపుదిద్దుకుంటోంది. తిరంగా యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పర్యావరణహిత గణపతి ఇది. 72 అడుగుల ఎత్తుతో అష్టసిద్ధి మహాగణపతిగా శిల్పి కొత్తకొండ నగేష్‌ ఆధ్వర్యంలో కొలువుదీరనున్నాడు. 8 ఏళ్లుగా మట్టిగణపతి ఏర్పాటుచేస్తున్నారు. 9 సంఖ్యతో గణిస్తూ ఒక్కో ఏడాది ఎత్తు పెంచుతున్నారు. కర్రలు, గడ్డి, వరిపొట్టు, బంకమట్టి, సుతిలి, జనుము, కలకత్తా గంగమట్టితో చేస్తున్న ఈ గణపతి ఆకట్టుకునేలా వాటర్‌ కలర్స్‌ పెయింట్‌ చేస్తున్నారు. ఈనెల 26న మండపం వద్దే నిమజ్జనం చేయనున్నారు. సేకరుని ఇంట కొలువైన బొజ్జ గణపయ్య గణపతుల విగ్రహాలు, గిన్నిస్‌ రికార్డ్‌ పత్రంతో శేఖర్‌




