
నింగి నుంచే గస్తీ నిర్వహించే ఏఐ డ్రోన్‌ గణేశ్‌ ఉత్సవాల్లో అత్యాధునిక సాంకేతికతతో నిఘా ఈనాడు- హైదరాబాద్‌: నగరంలో భారీ జన సందోహంతో కూడిన ర్యాలీలు, గణేశ్‌ శోభాయాత్ర లాంటి వేడుకలు జరిగినప్పుడు ఆకాశం నుంచే నిఘా పెట్టగలిగే అస్త్రాన్నే వాడబోతున్నారు. టీజీ క్వెస్ట్‌లో భాగంగా పోలీసు శాఖ ప్రవేశపెట్టిన అత్యాధునిక ఏఐ ఇంటిగ్రేటెడ్‌ పోలీసింగ్‌ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ సాంకేతికతతో కూడిన డ్రోన్లు ఆకాశం నుంచే గస్తీ నిర్వహించనున్నాయి. అత్యంత వేగంగా పరిస్థితుల్ని అంచనా వేసి అప్రమత్తం చేసేలా దీన్ని రూపొందించారు. గతేడాది మేడారం జాతర సందర్భంగా ఈ సాంకేతికతను వాడారు. ఇప్పుడు నగరంలో గణేశ్‌ ఉత్సవాలకు మల్కాజిగిరి పోలీసులు వాడనున్నారు. అదనపు బలం.. సాధారణంగా ప్యాట్రోలింగ్‌ అంటే పోలీసులు వాహనాల్లో లేదా కాలినడకన గస్తీ నిర్వహిస్తుంటారు. ఈ ఏఐ డ్రోన్‌ మాత్రం ఆకాశం నుంచి అచ్చం పోలీసులా కాపలా కాస్తూ పనిచేస్తుంది. వేలాది మంది జనంలోనూ అసాధారణ కదలికల్ని తేలిగ్గా గుర్తిస్తుంది. ఒక్క డ్రోన్‌ 3-4 ప్యాట్రోలింగ్‌ యూనిట్లకు సరిసమానమని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల నుంచి గణేశ్‌ నిమజ్జనం, ఇతర భారీ వేడుకల సందర్భంగా పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వీటిని కేవలం లైవ్‌ ఫీడ్‌ ద్వారా పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వాడుతున్నారు. తాజా డ్రోన్లు మాత్రం కృత్రిమ మేధస్సుతో రియల్‌టైమ్‌లో పరిస్థితిని అంచనా వేసి కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం ఇస్తుంది. వీటికి అదనంగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





