
వేదికపై నాయకులు రామ్‌ తాళ్లూరి, గడల శ్రీనివాసరావు, సాగర్, తనీశ్‌ తదితరులు ఖమ్మం సారథినగర్, న్యూస్‌టుడే: ముగ్గురు మంత్రులు కీలక శాఖలు నిర్వహిస్తున్నా రెండు జిల్లాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుని ఉన్నాయని జనసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అభ్యర్థి డా.గడల శ్రీనివాసరావు విమర్శించారు. జనసేన ఆధ్వర్యంలో శంఖారావం పేరుతో ఖమ్మం నగరంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సభ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని వనజీవి రామయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో గడల మాట్లాడుతూ పది అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అధికార పార్టీ వారు అంటున్నారని, ఒక్కరు కూడా ఈసారి గెలవరని జోస్యం చెప్పారు. విపక్ష భారాసను ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాదులో ధర్నా సందర్భంగా పోలీసుల గోళ్లు తగిలాయని యాంటీ సెప్టిక్‌ ఇంజెక్షన్లు తీసుకున్న నాయకులు హత్యాచారానికి గురైన ఆదివాసీ బిడ్డ కుటుంబం క్షోభను పట్టించుకోలేదని ఆరోపించారు. సామాజిక తెలంగాణ నినాదంతో శంఖారావం పూరించే ఉద్దేశంతో సభ ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అన్నా అంటే నేనున్నా’ అని చెప్పుకొని తిరిగిన పొంగులేటి శీనన్న (మంత్రి) తీరిక లేకుండా ఉంటున్నారని, అన్నా అంటే గడల శీనన్న అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పారు. ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతున్న తీరును పాట రూపంలో వినిపించారు. సభలో జనసేన నేత, సినీనటుడు తనీశ్‌ మాట్లాడారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పవన్‌కల్యాణ్‌ చేసిన సేవా కార్యక్రమాలను తెరపై ప్రదర్శించారు. నాయకులు రామ్‌ తాళ్లూరి, తనీశ్, మేకల సతీష్‌రెడ్డి, మచ్చా సుధాకర్, ప్రేమ్‌కుమార్, శంకర్‌ గౌడ్, రాజలింగం, సాగర్, మీసాల శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.