
252 కేజీబీవీలకు 45,360 బంకర్‌ బెడ్ల సరఫరా తీరనున్న 90 వేల మంది విద్యార్థినుల కష్టాలు సూర్యాపేట జిల్లాలోని ఓ కేజీబీవీకి సరఫరా చేసిన బంకర్‌ బెడ్లు ఈనాడు, హైదరాబాద్‌: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)కు ఎట్టకేలకు బంకర్‌ బెడ్లు అందుతున్నాయి. విద్యార్థినులకు నేలపైనే నిద్రించే ఇబ్బందులు తీరనున్నాయి. వారికి పరుపులు, దిండ్లతోకూడిన బంకర్‌ బెడ్లను పాఠశాల విద్యాశాఖ సరఫరా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీలుండగా.. 252 విద్యాలయాలకు 45,360 బంకర్‌ బెడ్లను పంపిస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు నేలపైనే నిద్రిస్తూ.. ఎటువైపు నుంచి పురుగులు, కీటకాలు వస్తాయోనని భయాందోళనలకు లోనవుతున్న విద్యార్థినులు ఇక హాయిగా నిద్రపోయే రోజులు వచ్చినట్లే. ఒక బెడ్‌ను ఇద్దరు అమ్మాయిలకు కేటాయించవచ్చు. దానివల్ల దాదాపు 90 వేల మంది విద్యార్థినుల కష్టాలు తొలిగిపోనున్నాయి. బంకర్‌ బెడ్ల సరఫరా నిమిత్తం 2025 ఏప్రిల్‌లో పాఠశాల విద్యాశాఖ రూ.121 కోట్లకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే వాటి సరఫరాకు గడువును పొడిగించారని, రూ.15-17 వేల విలువైన బంకర్‌ బెడ్‌ను రూ.33 వేలకు కొనుగోలు చేస్తున్నారని, దానివల్ల ప్రభుత్వంపై రూ.కోట్లలో అదనపు భారం పడుతోందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చివరకు ఈ ఏడాది మే నెలలో పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ బెడ్ల సరఫరాను ప్రారంభించింది. దాదాపు ఈ ప్రక్రియ పూర్తికావొచ్చింది. టెండర్‌లో పాల్గొన్న కొందరు కాంట్రాక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే స్టే ఇవ్వనందున బెడ్లను సరఫరా చేస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న పిటిషన్‌ను స్వీకరించాలా.. లేదా.. అన్నదానిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని అధికారి ఒకరు తెలిపారు. బెడ్లను సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో సరిపోవని కేజీబీవీ ఉపాధ్యాయులు చెబుతున్నారు. 495 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థినుల సంఖ్య దాదాపు లక్షన్నరకు చేరుకుంది. ఈసారి కేజీబీవీల్లో సుమారు 15 వేల మంది పెరిగారు. దాంతో సరఫరా చేస్తున్నవి పూర్తిగా సరిపోవని వారు పేర్కొంటున్నారు. తమ కేజీబీవీలో 400 మందికిపైగా అమ్మాయిలు ఉండగా.. కనీసం 200 బెడ్లు అవసరమని, తమకు 125 మాత్రమే వచ్చాయని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఒకరు తెలిపారు. మరికొన్నిచోట్ల 80 మాత్రమే ఇస్తున్నారు. సరిపోవని అడిగితే మళ్లీ సరఫరా చేస్తామని చెబుతున్నారని టీచర్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




