
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి హాజరు ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనం కావడాన్ని పురస్కరించుకొని తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం, భాజపా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుండగా... రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలు విలీనం పేరుతో, భారాస జాతీయ సమైక్యత దినోత్సవంగా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగే ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, కిషన్‌రెడ్డి, సహాయమంత్రి బండి సంజయ్, గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. భారాస తెలంగాణభవన్‌లో జరిగే జాతీయ సమైక్యత దినోత్సవంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు జెండాను ఎగురవేస్తారు. వామపక్షాలు తమ తమ కార్యాలయాల్లో ఉత్సవాలు జరపనున్నాయి. ఆయా పార్టీలు రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సవాలు నిర్వహించనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





