
విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న బండారు దత్తాత్రేయ, ఎన్‌.రామచందర్‌రావు, ఈటల రాజేందర్‌ తదితరులు కంటోన్మెంట్, న్యూస్‌టుడే: దేశ చరిత్రను చెప్పుకోవడానికి గర్వపడాలే కానీ సిగ్గుపడకూడదని హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. నేటి తరానికి సెప్టెంబరు 17న నిర్వహించే విమోచన దినోత్సవం ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మజ్లిస్‌ పార్టీకి భయపడి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌ ముక్తి దివస్‌’ పేరిట గురువారం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను బుధవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌లతో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం విమోచనం ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గత నాలుగు సంవత్సరాలుగా విమోచన దినోత్సవాన్ని కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేలా చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సూచించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ... సర్దార్‌ వల్లభభాయ్‌పటేల్‌ ఆపరేషన్‌ పోలో ద్వారా నిజాంను మోకరిల్లేలా చేసి హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయించారని తెలిపారు. ఈ అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి మన ఘన చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో వందేమాతరం గీతాన్ని పూర్తిగా పాడించాలని సూచించారు. తెలంగాణ చరిత్ర దాస్తే దాగేది కాదని, త్యాగాలతో కూడుకున్నదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





